మంగళవారం 24 నవంబర్ 2020
International - Nov 09, 2020 , 12:19:03

ఎల‌క్టోర‌ల్ కాలేజీ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాలి : బెర్నీ సాండ‌ర్స్‌

ఎల‌క్టోర‌ల్ కాలేజీ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాలి :  బెర్నీ సాండ‌ర్స్‌

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఎల‌క్టోర‌ల్ కాలేజీ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాల‌ని సేనేట‌ర్ బెర్నీ సాండ‌ర్స్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. డెమోక్ర‌టిక్ నేత అయిన బెర్నీ సాండ‌ర్స్‌..  బైడెన్‌తో అధ్య‌క్ష అభ్య‌ర్ధిత్వం కోసం పోటీ చేశారు.  అయితే బెర్నీ త‌ప్పుకోవ‌డంతో బైడెన్ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా డెమోక్ర‌టిక్ పార్టీ  త‌ర‌పున‌ పోటీ చేశారు. అయితే ఓ డెమోక్ర‌టిక్ నేత దేశాధ్య‌క్షుడిగా ఎన్నికైన త‌రుణంలో.. బెర్నీ ఈ కామెంట్ చేయ‌డం ఆశ్చ‌ర్యంగా మారింది. జో బైడెన్ పాపుల‌ర్ ఓటింగ్‌లో సుమారు 40 ల‌క్ష‌ల ఓట్ల తేడాతో నెగ్గనున్న‌ట్లు బెర్నీ  చెప్పారు.  గ‌త 8 దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థులు ఏడు సార్లు పాపుల‌ర్ ఓట్ల‌ను గెలిచిన‌ట్లు ఆయ‌న త‌న ట్వీట్‌లో తెలిపారు.  ఒకే వ్య‌క్తి.. ఒకే ఓటు.. ప్ర‌జాస్వామ్యం వ‌ర్ధిల్లాల‌న్న ఉద్దేశాన్ని ఆయ‌న త‌న ట్వీట్‌లో వినిపించారు. ఎల‌క్టోర‌ల్ కాలేజీ ఓటింగ్ విధానాన్ని ర‌ద్దు చేయాల్సిందే అని బెర్నీ త‌న ట్వీట్‌లో కోరారు. 

2016లో నేష‌న‌ల్ పాపుల‌ర్ ఓటింగ్‌లో హిల్ల‌రీ విజ‌యం సాధించారు. ఆమెకు ట్రంప్ క‌న్నా సుమారు 30 ల‌క్ష‌ల ఓట్లు అధికంగా పోల‌య్యాయి. కానీ ఆ ఎన్నిక‌ల్లో ఎల‌క్టోర‌ల్ ఓట్ల ఆధారంగా డోనాల్డ్ ట్రంప్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించారు.  ఇటీవ‌ల కాలంలో అమెరికా ఎన్నిక‌ల్లో ఎల‌క్టోర‌ల్ కాలేజీ విధానం వ‌ల్ల డెమోక్ర‌టిక్ పార్టీ అభ్య‌ర్థులు తీవ్ర న‌ష్టాన్ని చ‌వి చూశారు. కానీ ఎల‌క్టోర‌ల్ ఓట్ల వ్య‌వ‌స్థ‌ను మార్చేసి.. పాపుల‌ర్ ఓటు ద్వారా గెలిచిన వారే వైట్‌హౌజ్‌కు వెళ్లే  విధంగా వ్య‌వ‌స్థ‌ను రూపొందించాల‌ని బెర్నీ అభిప్రాయ‌ప‌డ్డారు.  

వాస్త‌వానికి 1970లో ఎల‌క్టోర‌ల్ కాలేజీ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేసే విధంగా అమెరికా ప్ర‌తినిధుల స‌భ‌లో ఓటింగ్ జ‌రిగింది. పాపుల‌ర్ ఓటు ద్వారానే అధ్య‌క్షుడి ఎన్నిక జ‌ర‌గాల‌ని అప్ప‌ట్లో గాలప్ స‌ర్వే కూడా చెప్పింది. కానీ ద‌క్షిణ అమెరికా రాష్ట్రాల్లోని సేనేట‌ర్లు ఆ ప్ర‌క్రియ‌ను అడ్డుకున్నారు. ఎల‌క్టోర‌ల్ కాలేజీ వ్య‌వ‌స్థ ద్వారా ల‌బ్ధి పొందే వారు ఆ వ్య‌వ‌స్థ‌ను అడ్డుకున్న‌ట్లు తెలుస్తోంది. అప్ప‌టి నుంచి ఆ ప‌ద్ధ‌తి ద్వారా రిప‌బ్లిక‌న్లే ఎక్కువ‌గా బెనిఫిట్ అయిన‌ట్లు తెలుస్తోంది.  అయితే ఎన్నిక‌ల విధానంపై రాష్ట్రాల మ‌ధ్య భిన్నాభిప్రాయ‌లు ఉన్నాయి. పాపుల‌ర్ ఓటుపై ఏకాభిప్రాయం కుదిరితే.. అప్పుడు ఎల‌క్టోర‌ల్ కాలేజీ విధానాన్ని ర‌ద్దు చేసే అవ‌కాశం ఉంటుంది.  2000 సంవ‌త్స‌రంలో జార్జ్ బుష్ పాపుల‌ర్ ఓట్‌లో ఓడిపోయారు. కానీ ఎల‌క్టోర‌ల్ కాలేజీ ఓట్ల‌లో ఆయ‌న నెగ్గారు.  డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి అల్ గోరే(266)పై జార్జ్ బుష్‌(271) గెలుపొందారు.