బుధవారం 03 జూన్ 2020
International - Apr 08, 2020 , 01:25:21

మేం కోలుకుంటున్నాం

మేం కోలుకుంటున్నాం

  • తాజాగా ఒక్క మరణమూ లేదన్న చైనా
  • నేటి నుంచి వుహాన్‌ కేంద్రంగా రాకపోకలు

బీజింగ్‌, ఏప్రిల్‌ 7: కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. ఈ వైరస్‌ వల్ల సోమవారం ఒక్కరూ కూడా మరణించలేదని ఆ దేశం ప్రకటించింది. కరోనా మరణాలను జనవరి నుంచి వెల్లడిస్తున్న చైనా తాజాగా ఒక్కరూ కూడా మరణించలేదని ప్రకటించడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో వైరస్‌కు కేంద్ర బిందువైన వుహాన్‌ నగరం నుంచి ఇతర ప్రాంతాలకు ప్రజలు రాకపోకలు సాగించేలా చైనా చర్యలు చేపడుతున్నది. బుధవారం నుంచి వుహాన్‌ కేంద్రంగా మిగతా ప్రాంతాలకు బస్సు, రైళ్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నగరంలోనే తొలిసారిగా కరోనా వెలుగు చూసిన విషయం తెలిసిందే. అయితే దీన్ని కట్టడి చేయడానికి జనవరి 23 నుంచి వుహాన్‌ నగరంలో లాక్‌డౌన్‌ విధించారు. అయితే ఇటీవల వుహాన్‌లో పరిస్థితులు కొంత అదుపులోకి రావడంతో తొలుత అంతర్గత రవాణాకు అధికారులు అనుమతించారు. అయితే చైనాలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణుగుతున్న తరుణంలో వుహాన్‌ నుంచి మిగతా ప్రాంతాలకు ప్రజా రవాణాను పునరుద్ధరించడం సరికాదని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. logo