బుధవారం 28 అక్టోబర్ 2020
International - Sep 26, 2020 , 22:31:28

అమెరికాలో మైనపు విగ్రహాలు వేగంగా కరుగుతున్నాయి.. కారణమిదే!

అమెరికాలో మైనపు విగ్రహాలు వేగంగా కరుగుతున్నాయి.. కారణమిదే!

వాషింగ్టన్‌: వాతావరణ మార్పు ప్రపంచాన్ని కలవర పెడుతున్న అతిపెద్ద సమస్య. దీనిపై నాయకులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్జీవోలు, పర్యావరణ కార్యకర్తలు నిత్యం దీనిపై పోరాటం చేస్తూనే ఉన్నారు. కాగా, వాతావరణ మార్పు అనేది వేగంగా ఎలా పెరుగుతుందనే విషయం కళ్లకుకట్టడానికి అమెరికాలోని సీఎల్‌ఈవో అనే ఇన్‌స్టిట్యూట్‌ వినూత్న ఐడియాతో ముందుకొచ్చింది. 

ఫ్లోరిడాలోని ఓర్లాండోలోగల సిటీహాల్‌ బయట బెంచ్‌పై ఓతాత, మనువడి మైనపు విగ్రహాన్ని సీఎల్‌ఈవో బృందం ఏర్పాటు చేసింది. వారిద్దరూ ఐస్‌క్రీం తింటున్నట్లుగా బొమ్మలను రూపొందించారు. అయితే, అవి వేడికి కరగడం ప్రారంభించాయి. వారంలోగా చాలావరకు కరిగిపోయాయి. దీన్ని ఫేస్‌బుక్‌ లైవ్ ద్వారా ప్రజలకు చూపించి, వాతావరణ మార్పులపై అవగాహన కల్పిస్తున్నారు. ఆ ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో డాక్టర్‌ అన్నా లిజామాక్లార్క్‌ మాట్లాడుతూ, ఓర్లాండో నగరంలో మూడు వారాల నుంచి మూడు నెలలపాటు వంద డిగ్రీల ఫారన్‌హీట్ల ఉష్ణోగ్రత దాటిపోతున్నదని వెల్లడించారు. ఓర్లాండోతోపాటు టంపా, మయామి నగరాల్లో కూడా ఇదేరకమైన పరిస్థితి ఉందన్నారు. వాతావరణ మార్పు అనేది ఒక వాస్తవికత. ప్రజలు దీనిని విశ్వసించాలని అంటున్నారు. దీనివల్ల ఆర్కిటిక్, అంటార్కిటిక్ సర్కిల్‌లలో ఐస్ క్యాప్స్ కరగడం ప్రారంభించాయని, దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఉష్ణోగ్రత పరివర్తన ఏర్పడిందని ఆమె వివరించారు. ఇకనైనా నాయకులు మేలుకోవాలని కోరారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo