ఆదివారం 29 నవంబర్ 2020
International - Oct 28, 2020 , 02:23:57

వెలుగుల్లోనూ నీటి జాడలు

వెలుగుల్లోనూ నీటి జాడలు

  • చంద్రుడిపై నీటి అన్వేషణలో..మరో కీలక ముందడుగు
  • సూర్యరశ్మి సోకే ప్రాంతంలోనీటి ఆనవాళ్లు
  • నాసా ‘సోఫియా’ టెలిస్కోప్‌ ద్వారా వెల్లడి

వాషింగ్టన్‌: తెల్లని వెన్నెలను ప్రసరించే అందమైన చందమామ మీద నీటి ఆనవాళ్లు గతంలో అంచనా వేసిన దాని కంటే ఎక్కువగానే ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడిపై వెలుగు చూడని ప్రాం తాల్లోనే గాకుండా సూర్యరశ్మి ప్రసరించే ప్రాంతాల్లో కూడా నీటి జాడలు కనిపించినట్టు నాసా శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. చందమామపై నీటి జాడలు ఉన్నట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్‌-1 ప్రయోగం ద్వారా తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. అయితే చంద్రుడిపై ఉన్న అతి చల్లని, చీకటి ప్రాంతాల్లోనే నీటి ఆనవాళ్లు ఉన్నట్టు ఇప్పటివరకూ శాస్త్రవేత్తలు భావిస్తూ వస్తున్నారు. తాజాగా చంద్రుడి ఉపరితలాన్ని స్కానింగ్‌ చేసిన నాసాకు చెందిన స్ట్రాటోస్పియరిక్‌ అబ్జర్వేటరీ ఫర్‌ ఇన్ఫ్రారెడ్‌ ఆస్ట్రానమీ (సోఫియా) ఎయిర్‌బోర్న్‌ టెలిస్కోప్‌ సమాచారాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు కొత్త విషయాలు తెలుసుకున్నారు. సూర్యుడి కాంతి ప్రసరించే చంద్రుడి ఉపరితలంలో కూడా నీటి అణువుల జాడలను కనుగొన్నామని వాళ్లు తెలిపారు. ఈ ఫలితాలు భవిష్యత్‌ అంతరిక్ష పరిశోధనలకు కీలకం కానున్నట్టు వివరించారు. ఈ వివరాలు ‘నేచర్‌ ఆస్ట్రానమీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

ఎంత నీరు ఉండొచ్చు?

ఒక క్యూబిక్‌  మీటర్‌ మట్టిలో 12 ఔన్సుల నీరు (354 మిల్లీలీటర్లు) చొప్పున భారీ ఎత్తున నీళ్లు ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

నీటి ఆనవాళ్లు ఎక్కడ?

చంద్రుడి దక్షిణార్ధ గోళంలో క్లావియస్‌ అనే ఓ భారీ బిలం ఉంటుంది. భూమిపై నుంచి చూస్తే చంద్రుడిపై కనిపించే పెద్ద శిలల ఆనవాళ్లు ఈ బిలానికి చెందినవే. ప్రస్తుతం కనుగొన్న నీటి జాడలు ఈ బిలంలోనివేనని నాసా పరిశోధకులు తెలిపారు.

భవిష్యత్‌ పరిశోధనలకు ఊతం

అంగారక గ్రహం, సౌరకుటుంబంలోని వివిధ గ్రహశకలాలపై నీటి జాడకు సంబంధించిన పరిశోధనలు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి. తాజా ప్రయోగ ఫలితాలు ఈ పరిశోధనలకు సాయపడనున్నట్టు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.