మంగళవారం 31 మార్చి 2020
International - Mar 05, 2020 , 16:03:44

వాతావ‌ర‌ణం వేడెక్కితే.. క‌రోనా క‌నిపించ‌దా ?

వాతావ‌ర‌ణం వేడెక్కితే.. క‌రోనా క‌నిపించ‌దా ?

హైద‌రాబాద్‌:  క‌రోనాను క‌ట్టడి చేయ‌డ‌మే ప్ర‌పంచ దేశాల ల‌క్ష్యం.  ఆ దిశ‌గా అన్ని దేశాలు త‌మ వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. కానీ ఆ డెడ్లీ వైర‌స్‌ను ఆపేది ప్ర‌కృతే అన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.  వాతావ‌ర‌ణం వేడెక్కితే.. వైర‌స్ ఛాయ‌లు క‌నిపించ‌వు అన్న ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి. స్వ‌ల్పంగా వాతావ‌ర‌ణం హీటెక్కితే.. వైర‌స్ ప్ర‌బ‌లుతున్న తీరు మంద‌గిస్తుంద‌న్న టాక్ న‌డుస్తోంది. కానీ నిపుణులు మాత్రం ఆ ఐడియాకు ఫిక్స్ కావ‌డం తొంద‌ర‌పాటు అవుతుందేమో అని అంటున్నారు.  

కరోనా జాతి వైర‌స్‌లు సాధార‌ణంగా జ‌లుబు, ద‌గ్గు లాంటి వ్యాధుల‌ను క‌ల‌గ‌చేస్తాయి. కొన్ని సంద‌ర్భాల్లో ఆ జాతి వైర‌స్‌ల వ‌ల్ల మెర్స్‌, సార్స్ లాంటి తీవ్ర స్థాయి రోగాలు కూడా వ‌స్తాయి. క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌నిపిస్తుంటుంది. ఈ వైర‌స్‌లు ప్ర‌తి ఒక్క‌రి జీవితాల్లో ఏదో ఒక సంద‌ర్భంలో సోకుతూనే ఉంటాయి.  కానీ నావెల్ క‌రోనా వైర‌స్ మాత్రం చాలా భిన్న‌మైంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఇటీవ‌ల వెల్ల‌డించింది. గ‌తంలో సోకిన ఫ్లూ లాంటి వైర‌స్‌ల త‌ర‌హాలోనూ ఇది కూడా మ‌హమ్మారిగా జ‌న‌హ‌న‌నం చేస్తుంద‌న్న భయాందోళ‌న‌లు క‌లిగిస్తోంది.  

సాధార‌ణంగా జలుబు, ద‌గ్గు అనేవి సీజ‌న‌ల్ వ్యాధులు. అమెరికా లాంటి దేశంలో కూడా ఈ సీజ‌నల్ వ్యాధులు విజృంభిస్తాయి. డిసెంబ‌ర్ నుంచి ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య కాలంలో ఆ దేశంలో ఈ వ్యాధులు సోకిన వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది. కానీ కోవిడ్‌19 ప్ర‌బ‌లుతున్న తీరు.. కొత్త భ‌యాందోళ‌న‌ల‌కు దారి తీస్తున్న‌ది. 2003లో సార్స్ కూడా శీతాకాలంలోనే వ్యాప్తిచెందింది. ఇప్పుడు కూడా క‌రోనా19 ఆ సీజ‌న్‌లోనే విజృంభించింది.  ఉత్త‌ర ద్రువంలో ఇప్పుడిప్పుడే వ‌సంత రుతువు మొద‌లవుతోంది.  దీని వ‌ల్ల ఉత్తర ద్రువ ప్రాంతాల్లో మెల్ల‌మెల్ల‌గా వాతావ‌ర‌ణం వేడెక్క‌నున్న‌ది.  అంటే వాతావ‌ర‌ణం వేడెక్కితే.. వైర‌స్ నెమ్మ‌దిగా క‌నుమ‌రుగు అవుతుందేమో అన్న భావన‌లు వ్య‌క్తం అవుతున్నాయి.  ఏప్రిల్ నెల చివ‌ర‌లోగా క‌రోనా మాయం అవుతుంద‌ని ఇటీవ‌ల అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ బ‌హిరంగ‌స‌భ‌లో వెల్ల‌డించారు.  

కానీ శాస్త్ర‌వేత్త‌లు మాత్రం ఇలాంటి థియ‌రీల ప‌ట్ల నిరాస‌క్త‌తో ఉన్నారు. చాలా వ‌ర‌కు శాస్త్ర‌వేత్త‌లు.. క‌రోనా ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తున్నారు. వైర‌స్ ప్ర‌బ‌లుతున్న తీరు చూస్తుంటే.. వెద‌ర్ వేడిక్కినా ప‌రిస్థితి మారుతుంద‌న్న సంకేతాలు అంద‌డం క‌ష్ట‌మే అని అంటున్నారు. వైర‌స్ వ్యాప్తి చెందుతున్న తీరు, దాని తీవ్ర‌త‌, నియంత్ర‌ణ చ‌ర్య‌లు, వాతావ‌ర‌ణం లాంటి అనేక అంశాల ఆధారంగా ఆ వైర‌స్ భ‌విష్య‌త్తును అంచ‌నా వేయ‌డం జ‌రుగుతుంద‌ని పెన్సిల్వేనియా వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ ఎలిజ‌బెత్ మెక్‌గ్రావ్ తెలిపారు.  ఇది సార్స్ కాదు, మెర్స్ కాదు, ఇన్‌ఫ్లూయాంజా కాదు, ఇదో కొత్త ర‌కం వైర‌స్ అని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఇటీవ‌ల వెల్ల‌డించింది.

డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చరిక‌ల‌ నేప‌థ్యంలో ప్రపంచ దేశాలు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నాయి. ఎటువంటి నిర్లిప్త‌త ద‌రిచేయ‌నీయ‌కూడ‌ద‌న్న భావ‌న‌లో ప్ర‌పంచ దేశాలు ఉన్నాయి.  ఉత్త‌ర ద్రువ దేశాలు ఇప్పుడిప్పుడే వసంత రుతువుల్లోకి ప్ర‌యాణిస్తున్నాయి. వ‌సంతం(స్ప్రింగ్‌)లో కొంత వ‌ర‌కు వెద‌ర్ వేడిగా ఉంటుంది. దాని వ‌ల్ల వైర‌స్ తీవ్ర‌త త‌గ్గుతుందేమో అన్న అభిప్రాయాల‌ను వినిపిస్తున్నారు. ఇండియాలో కూడా ఇప్పుడే ఎండాకాలం మొద‌లైంది.  ఎండ‌లు ముదిరితే.. వైర‌స్ ఆవిర‌వుతుంద‌ని అనుకుంటున్నారు.  కానీ ఏదేమైనా వైర‌స్ ప‌ట్ల మాత్రం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు. 

ప్ర‌తి ఒక‌రు వ్య‌క్తిగ‌తంగా.. రెగ్యుల‌ర్‌గా వ్యాయామం చేయాలి.  పౌష్టిక ఆహారం తీసుకోవాలి.  కావాల్సినంత నిద్ర పోవాలి. ఉన్న‌త ప్ర‌మాణాలతో ప‌రిస‌రాల‌ను ఉంచుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా.. మ‌న మాన‌సిక స్థితిని అత్యంత ఆరోగ్యంగా ఉంచుకోవాలి. 


logo
>>>>>>