శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 03, 2020 , 08:47:42

ఫ్రాన్స్ ప‌రిస్థితి దారుణం!

ఫ్రాన్స్ ప‌రిస్థితి దారుణం!

న్యూఢిల్లీ: ప‌్రాణాంత‌క కరోనా మహమ్మారి ప్ర‌పంచ దేశాలను అత‌లాకుత‌లం చేస్తున్న‌ది. ముఖ్యంగా అమెరికా, యూర‌ప్ దేశాల ప‌రిస్థితి అత్యంత ద‌య‌నీయంగా త‌యారైంది. అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌ దేశాల్లో రోజురోజుకు కేసులు వేలల్లో, మ‌ర‌ణాలు వంద‌ల్లో పెరుగుతున్నాయి. అమెరికా, ఇట‌లీ, స్పెయిన్ దేశాల‌తో పోల్చిన‌ప్పుడు ఫ్రాన్స్‌లో కేసుల సంఖ్య త‌క్కువ‌గా ఉన్నా.. మ‌ర‌ణాలు మాత్రం విప‌రీతంగా పెరుగుతున్నాయి.  

దీంతో ఆ దేశంలో శ‌వ‌పేటిక‌లు పెట్టేందుకు కూడా చోటు దొర‌క‌ని పరిస్థితి నెల‌కొన్న‌ది. ఇప్ప‌టికే పారిస్ న‌గ‌రంలోని ఏ శ్మ‌శానంలో చూసినా శ‌వ‌పేటిక‌లు గుట్ట‌ల్లా పేరుకుపోయాయి. మ‌ర‌ణాలు వేగంగా పెరుగుతుండ‌టంతో అందుకు స‌రిప‌డా శ‌వ‌పేటిక‌ల‌ను అందుబాటులో ఉంచేందుకు చోటు లేకుండా పోయింది. దీంతో ఫ్రాన్స్ పోలీసులు పారిస్ సిటీలోని అతిపెద్ద ఫుడ్ మార్కెట్ అయిన రంజిస్‌లోని ఒక హాలును శ‌వ‌పేటిక‌లు పెట్ట‌డం కోసం స్వాధీనం చేసుకున్నారు. 

ఫ్రాన్స్ లో మొద‌ట ఇంత ద‌య‌నీయ‌మైన పరిస్థితులు లేక పోయినా.. రోజులు గ‌డిచినా కొద్ది దారుణంగా మారింది. కేసుల సంఖ్య త‌క్కువగానే ఉన్నా మరణాల సంఖ్య చాలా ఎక్కువగా న‌మోద‌వుతున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు ఫ్రాన్స్‌లో మొత్తం 60 వేల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇట‌లీ, స్పెయిన్ దేశాల‌లో న‌మోదైన పాజిటివ్ కేసుల‌తో పోల్చితే ఇది చాలా త‌క్కువ‌. కానీ మ‌ర‌ణాల సంఖ్యలో మాత్రం ఫ్రాన్స్ ఇట‌లీ, స్పెయిన్ దేశాల‌కు పోటీ ప‌డుతున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు ఫ్రాన్స్‌లో నమోదైన క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య ఐదు వేలు దాటింది. 
logo