బుధవారం 25 నవంబర్ 2020
International - Nov 10, 2020 , 03:12:48

బైడెన్‌ టీమ్‌లో మన డాక్టర్‌ బాబు

బైడెన్‌ టీమ్‌లో మన డాక్టర్‌ బాబు

  • కరోనా టాస్క్‌ ఫోర్స్‌లో వివేక్‌ మూర్తి 

మైసూర్‌ (కర్ణాటక): అమెరికాలో మరో భారత సంతతికి వ్యక్తికి అరుదైన గౌరవం లభించింది. కరోనా కట్టడికి జో బైడెన్‌ ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసిన కొవిడ్‌-19 టాస్క్‌ ఫోర్స్‌లో ఇండో-అమెరికన్‌, అమెరికా మాజీ సర్జన్‌ జనరల్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి (43) సభ్యుడిగా ఎన్నికయ్యారు. వివేక్‌ మూర్తి జూలై 10, 1977లో ఇంగ్లాండ్‌లో జన్మించారు. ఈయన పూర్వీకులు కర్ణాటకకు చెందినవారు. భారత్‌ నుంచి బ్రిటన్‌కు వలస వెళ్లారు. వివేక్‌కు మూడేండ్ల వయసున్నప్పుడు ఆయన తండ్రి లక్ష్మీనారాయణ మూర్తి బ్రిటన్‌ నుంచి అమెరికాలోని ఫ్లోరిడాకు మకాం మార్చారు. వివేక్‌ ప్రతిష్ఠాత్మక హార్వర్డ్‌ వర్సిటీలో బ్యాచిలర్స్‌ డిగ్రీ, యేల్‌ యూనివర్సిటీల్లో ఎండీని అభ్యసించారు. 1995లో ‘విజన్స్‌ వరల్డ్‌వైడ్‌' పేరిట ఓ ఎన్జీవోను స్థాపించారు. దీనిద్వారా ఎయిడ్స్‌ పట్ల అమెరికా, భారత్‌లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. 2014-2017 మధ్యకాలంలో ఒబామాతో పాటు డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో 19వ అమెరికా సర్జన్‌ జనరల్‌గా విధులు నిర్వహించారు.

బైడెన్‌కూ చెన్నైతో సంబంధాలు!

చెన్నై:  జో బైడెన్‌కూ చెన్నైతో సంబంధాలు ఉన్నాయి. బైడెన్‌ పూర్వీకులు 19వ శతాబ్దంలో ఈస్టిండియా కంపెనీలో పనిచేసేవారు. సోదరులైన క్రిస్టోఫర్‌, విలియమ్‌ బైడెన్‌లు లండన్‌, చెన్నై మధ్య నౌకల్లో పనిచేసేవారు. విలియం చిన్న వయసులోనే మరణించగా, క్రిస్టోఫర్‌  కెప్టెన్‌గా ఎదిగారు. 

కమల ప్రమాణానికి ‘చిట్టీ’!

అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలాహ్యారిస్‌ ప్రమాణ స్వీకారోత్సవం చూడటానికి ఆమె బంధువు  సరళా గోపాలన్‌ వెళ్లనున్నారు.   హ్యారిస్‌ ఆమెను ‘చిట్టీ’ అని పిలుస్తారు. ‘కమల పట్టుదల కలిగిన వ్యక్తి అని మాకు తెలుసు. కానీ ఇంత పెద్ద పదవి సాధిస్తుందని ఊహించలేదు’ అని సరళ అన్నారు. 

బైడెన్‌కు బుష్‌ శుభాకాంక్షలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు చట్టబద్ధంగానే జరిగాయని రిపబ్లికన్‌ నేత, మాజీ అధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులుగా విజయం సాధించిన జో బైడెన్‌, కమలా హ్యారిస్‌లకు బుష్‌ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు.