గురువారం 28 మే 2020
International - Apr 20, 2020 , 02:30:48

ల్యాబ్‌ నుంచే లీక్‌!

ల్యాబ్‌ నుంచే లీక్‌!

  • వుహాన్‌ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ నుంచే వైరస్‌ బయటకు
  • ల్యాబ్‌ ఉద్యోగి ద్వారా స్థానికులకు కరోనా సంక్రమణ
  • అగ్రరాజ్యంతో చైనా పోటీపడే క్రమంలోనే ఈ ఉపద్రవం
  • జీవాయుధం కోసం కాదంటూ ఫాక్స్‌ న్యూస్‌ కథనం

ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి చైనాలోని వుహాన్‌ ల్యాబొరేటరీ నుంచే లీక్‌ అయిందన్న వాదనలు బలపడుతున్నాయి. జీవాయుధం (బయోవెపన్‌) తయారీ కోసం కాకపోయినా.. వైరస్‌లను గుర్తించడం, వాటిని ఎదుర్కోవడంలో అగ్రరాజ్యం అమెరికా కంటే తమదే పైచేయి అని చైనా చాటుకునే ప్రయత్నంలో.. ఈ ఉపద్రవం సంభవించి ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు ఫాక్స్‌ న్యూస్‌ ఒక కథనం ప్రచురించింది. ‘ఇప్పటివరకు ఒక ప్రభుత్వం చేస్తున్న అత్యంత ఖరీదైన కప్పిపుచ్చే ప్రయత్నం’ బహుశా ఇదేనని ఆ వర్గాలు వ్యాఖ్యానించినట్లు పేర్కొంది. వుహాన్‌ ల్యాబ్‌పై అమెరికా దృష్టిసారించిందని, అక్కడి నుంచి వైరస్‌ ఎలా లీకైంది? అందులో నిజమెంత? అన్న అంశాన్ని నిగ్గుతేల్చేందుకు ఆ దేశ నిఘా వర్గాలు కూపీ లాగుతున్నట్లు ఫాక్స్‌ న్యూస్‌ తెలిపింది. కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి తెలిసి కూడా బాధ్యతారహితంగా వ్యవహరించినట్లు తేలితే  చైనాపై తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదివారం హెచ్చరించారు. 

ల్యాబ్‌ ఉద్యోగే.. పేషెంట్‌ జీరో..

వుహాన్‌ ల్యాబ్‌లో పనిచేస్తున్న ఉద్యోగికి గబ్బిలాల నుంచి తొలుత వైరస్‌ వ్యాపించి ఉండొచ్చని,  ఆ ‘పేషెంట్‌ జీరో’ ద్వారా స్థానికులకు వైరస్‌ సంక్రమించి ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ  ఫాక్స్‌ న్యూస్‌ వెల్లడించింది. వుహాన్‌లోని ‘వెట్‌ మార్కెట్‌' నుంచే వైరస్‌ వ్యాపించినట్లు మొదట వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ మార్కెట్‌లో ఎప్పుడూ గబ్బిలాలను విక్రయించలేదని,  ల్యాబ్‌పై నిందపడకుండా చైనా కావాలనే అందరి దృష్టిని మళ్లించిందని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. వుహాన్‌ ల్యాబ్‌లో సరైన భద్రతా ప్రమాణాలు లేవని, అక్కడ ప్రమాదకర పరిశోధనలు చేస్తున్నారని  2018 జనవరిలోనే అమెరికా ఎంబసీ అధికారులు హెచ్చరించినట్లు ‘ది వాషింగ్టన్‌ పోస్ట్‌' వెల్లడించింది. గొంతెత్తినవారిపై ఉక్కుపాదం..

కరోనాకు సంబంధించిన సమాచారాన్ని చైనా తొక్కిపెట్టిందని  విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు ఫాక్స్‌న్యూస్‌ పేర్కొంది. నమూనాలను ధ్వంసం చేశారని, కలుషితమైన ప్రదేశాలను శుభ్రపరిచారని, వైరస్‌పై తొలుత వెలువడిన వార్తలను చెరిపేశారని, అకడమిక్‌ కథనాలను కనపడకుండా చేశారని వివరించింది. అలాగే వైరస్‌ గురించి తొలుత హెచ్చరించిన డాక్టర్లు, జర్నలిస్టులు కనిపించకుండా పోయిన విషయాన్ని ప్రస్తావించింది. తన తప్పులను కప్పిపుచ్చుకోవడంలో చైనాకు డబ్ల్యూహెచ్‌వో మొదట నుంచి సహకారం అందించిందని ఫాక్స్‌ న్యూస్‌ పేర్కొంది. ఈ క్రమంలోనే డబ్ల్యూహెచ్‌వోకు నిధులను నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల ప్రకటించారు. 

అప్పుడే మేల్కొని ఉంటే..

కొత్త కరోనా వైరస్‌ రూపంలో మరో మహమ్మారి తమపై పంజా విసరబోతున్నదని చైనా అధికారులు రహస్యంగా నిర్ధారించిన తర్వాత ఆరు రోజులపాటు వుహాన్‌లో నూతన సంవత్సర వేడుకలు, ప్రజల రాకపోకలు భారీగా సాగాయని ఫాక్స్‌న్యూస్‌ తెలిపింది. తీరిగ్గా ఏడో రోజు జనవరి 20న  చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కరోనాపై ప్రజలను హెచ్చరించారు. అయితే అప్పటికే 3,000 మందికిపైగా వైరస్‌ సోకినట్లు ‘అసోసియేట్‌ ప్రెస్‌' సంపాదించిన ప్రభుత్వ అంతర్గత డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి. ‘ఆరు రోజుల ముందే చర్యలు తీసుకొని ఉంటే, రోగులు సంఖ్య చాలా తక్కువగా ఉండేది. వైద్య వసతులు సరిపోయేవి. వుహాన్‌ వైద్య వ్యవస్థ కుప్పకూలకుండా నివారించేవాళ్లం’ అని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో ఎపిడమాలజిస్ట్‌గా పనిచేస్తున్న జువో ఫెంగ్‌ జాంగ్‌ అభిప్రాయపడ్డారు. 

కరోనా మానవ సృష్టే: నోబెల్‌ గ్రహీత మాంటగ్నియర్‌

కరోనా వైరస్‌పై ఫ్రాన్స్‌కు చెందిన నోబెల్‌ గ్రహీత లూక్‌ మాంటగ్నియర్‌ సరికొత్త వివాదానికి తెరదీశారు. కరోనా మానవ సృష్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఎయిడ్స్‌ వైరస్‌కు వ్యాక్సిన్‌ రూపొందించే క్రమంలో చైనీస్‌ ల్యాబొరేటరీ నుంచి అది బయటకు వచ్చిందని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ జీనోమ్‌లో హెచ్‌ఐవీ, మలేరియా ఎలిమెంట్స్‌ ఉండడం తీవ్రంగా అనుమానించాల్సిన విషయమని చెప్పారు. వుహాన్‌ ల్యాబ్‌లో 2000 నుంచి కరోనా వైరస్‌లపై పరిశోధనలు చేస్తున్నారని, ఇందులో వారు నిష్ణాతులని పేర్కొన్నారు. హెచ్‌ఐవీ వైరస్‌ను గుర్తించినందుకు 2008లో మరో ఇద్దరు శాస్త్రవేత్తలతో కలిసి మాంటగ్నియర్‌ నోబెల్‌ అందుకున్నారు. 


logo