ఆదివారం 29 నవంబర్ 2020
International - Nov 05, 2020 , 12:57:31

ఇవాళ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ రౌండ్‌ టేబుల్ సమావేశం.. అధ్యక్షత వహించనున్న మోదీ

ఇవాళ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ రౌండ్‌ టేబుల్ సమావేశం.. అధ్యక్షత వహించనున్న మోదీ

న్యూఢిల్లీ : దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వర్చువల్‌ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ (వీజీఐఆర్)-2020 అధ్యక్షత వహించనున్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి 20 మంది అగ్రశ్రేణి కంపెనీల అధిపతులు పాల్గొననున్నారు. వీజీఐఆర్‌-2020 దేశ ఆర్థిక, పెట్టుబడి దృక్పథం, నిర్మాణాత్మక సంస్కరణలతో పాటు ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంపై ప్రభుత్వం చర్చించనుంది. రౌండ్‌ టేబుల్‌లో భారత తరఫున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రాతినిథ్యం వహించనున్నారు. యూఎస్‌, యూరప్‌, కెనడా, దక్షిణ కొరియా, జపాన్‌, మిడిల్‌ ఈస్ట్‌, ఆస్ట్రేలియా, సింగపూర్‌ సహా కీలక దేశాలకు చెందిన వ్యాపార సంస్థల అధినేతలు వర్చువల్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ రౌండ్‌ టేబుల్‌లో పాల్గొంటున్నారు.

టెమాసెక్‌, ఆస్ట్రేలియన్‌ సూపర్‌, సీడీపీక్యూ, సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్‌, జీఐసీ, ఫ్యూచర్‌ ఫండ్‌, జపాన్‌ పోస్ట్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌, కొరియన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌, నిప్పాన్ లైఫ్, ముబడాలా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, అంటారియో టీచర్స్, టీచర్స్ రిటైర్మెంట్ టెక్సాస్, పెన్షన్ డెన్మార్క్‌లాంటి సంస్థలు పాల్గొనున్నాయి. వీరితో పాటు దేశంలోని ఆరుగురు ప్రధాన పారిశ్రామిక వేత్తలైన దీపక్‌ పరేఖ్‌ (హెచ్‌డీఎఫ్‌సీ), దిలీప్‌ షాంఘ్వీ (సన్‌ ఫార్మా), ముఖేశ్‌ అంబానీ (ఆర్‌ఐఎల్‌), నందన్‌ నీలేకని (ఇన్ఫోసిస్‌), రతన్‌ టాటా (టాటా గ్రూప్స్‌) ఉదయ్‌ కొటక్‌ (కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌) తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. వీజీఐఆర్‌-2020 బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకొని, భారత్‌లోకి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఉపయోగపడనుంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.