e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home Top Slides విను వీధిలో విహార వాణిజ్యం

విను వీధిలో విహార వాణిజ్యం

విను వీధిలో విహార వాణిజ్యం
 • ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ ప్రయోగం సూపర్‌ సక్సెస్‌
 • 70 నిమిషాలపాటు దిగ్విజయంగా యాత్ర
 • రోదసిలోకి వెళ్లొచ్చిన తెలుగమ్మాయి శిరీష
 • మూడో భారత సంతతి మహిళగా రికార్డు
 • అంతరిక్ష పర్యాటకంలో కీలక ముందడుగు
 • 5 నిమిషాల పాటు భారరహిత స్థితిలో వ్యోమగాములు

హ్యూస్టన్‌, జూలై 11: అంతరిక్ష పర్యాటకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే క్రతువులో కీలక ముందడుగు పడింది. వినువీధిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అమెరికాకు చెందిన ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ అంతరిక్ష పరిశోధన సంస్థ ఆదివారం పంపించిన మానవసహిత వ్యోమనౌక ‘వీఎస్‌ఎస్‌ యూనిటీ-22’ ప్రయోగం విజయవంతమైంది. తొలిసారిగా అంతరిక్షంలోకి మనుషులను తీసుకెళ్లిన వాణిజ్య ప్రయోగంగా యూనిటీ-22 రికార్డు సృష్టించింది. మిషన్‌లో ప్రయాణించిన ఆరుగురు వ్యోమగాముల్లో ‘వర్జిన్‌ గ్రూప్‌’ అధిపతి రిచర్డ్‌ బ్రాన్‌సన్‌తో పాటు తెలుగింటి ఆడపడుచు శిరీష బండ్ల (34) కూడా ఉన్నారు. దీంతో ఆకాశవీధిలో తెలుగు కీర్తి పతాకం రెపరెపలాడింది. ఈ మిషన్‌ సక్సెస్‌తో రాకేష్‌ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ తర్వాత రోదసియానం చేసిన నాలుగో భారత సంతతి వ్యక్తిగా, మూడో భారత సంతతి మహిళగా శిరీష రికార్డు సృష్టించారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ ప్రయోగం.. వాతావరణ ప్రభావం కారణంగా గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. న్యూమెక్సికోలో వర్జిన్‌ గెలాక్టిక్‌ నిర్మించిన ‘స్పేస్‌పోర్ట్‌ అమెరికా’ లాంచింగ్‌ సెంటర్‌ నుంచి మొదలైన ఈ రోదసి యాత్ర.. దాదాపు 70 నిమిషాల పాటు కొనసాగింది. అంతరిక్షయానం చేసిన వ్యోమగాములు రాత్రి 9.20 గంటల ప్రాంతంలో (భారత కాలమానం) సురక్షితంగా తిరిగి భూమికి చేరుకున్నారు. రోదసిలో దాదాపు ఐదు నిమిషాల పాటు భారరహిత స్థితిలో ఉండి పుడమి అందాలను వీక్షించారు.

తెలుగు కీర్తి పతాక!
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జన్మించిన శిరీష.. తల్లిదండ్రులతో పాటు హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. పుర్డ్యూ యూనివర్సిటీలో డిగ్రీ, జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీలో బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేశారు. వర్జిన్‌ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. మిషన్‌లో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆమె చెప్పారు. ప్రయోగం విజయవంతం కావడంతో గుంటూరులో స్థానికులు సంబరాలు చేసుకున్నారు.

- Advertisement -

కొత్త అంతరిక్ష యుగానికి నవోదయం. ఇదో జీవితకాల అనుభవం. అద్భుతమైన నా బృంద సభ్యులకు అభినందనలు. 17 ఏండ్ల శ్రమ, కష్టానికి ఈ విజయం తార్కాణం -బ్రాన్‌సన్‌

బ్రాన్‌సన్‌ మూలాలు కూడా ఇక్కడే!
స్పేస్‌ టూరిజానికి పునాదివేసిన బ్రిటిష్‌ పారిశ్రామికవేత్త, ‘వర్జిన్‌ గ్రూప్‌’ అధిపతి రిచర్డ్‌ బ్రాన్‌సన్‌ మూలాలు భారత్‌కు చెందినవేనని 2019లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనే స్వయంగా తెలిపారు. డీఎన్‌ఏ పరీక్షలో ఈ విషయం వెల్లడైనట్టు పేర్కొన్నారు. తన తాతమ్మకు తాతమ్మ అయిన ఆరియా తమిళనాడుకు చెందినవారేనని, 1793లో కడలూరులో ఆమె నివసించినట్టు తెలిపారు. భారతీయులను కలిసిన ప్రతీసారి..‘బహూశా మనం బంధువులం అవుతామేమో’ అని వారితో చెబుతానని బ్రాన్‌సన్‌ పేర్కొన్నారు.

వచ్చేవారం‘అమెజాన్‌’ ప్రయోగం
ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అనుబంధ సంస్థ ‘బ్లూ ఆరిజిన్‌’ ఈ నెల 20న ‘న్యూ షెపర్డ్‌’ వ్యోమనౌకను రోదసిలోకి పంపనున్నది. అందులో ఆ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌తో కలిసి మొత్తం ఆరుగురు ప్రయాణించనున్నారు. 10-25 నిమిషాల పాటు రోదసిలో గడుపనున్నారు.

షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు మొదలవ్వాల్సిన ఈ యాత్ర గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. 90 నిమిషాల పాటు జరుగాల్సిన రోదసియానం 70 నిమిషాల్లో పూర్తయింది.

‘యూనిటీ-22’ యాత్ర సాగిందిలా..

 • రాత్రి 8.03 గంటలు
 • వీఎంఎస్‌ ఈవ్‌ అనే వైట్‌నైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌.. ‘యూనిటీ-22’ను నింగిలోకి తీసుకెళ్లింది.
 • రాత్రి 8.43 గంటలు
 • టేకాఫ్‌ అయిన 40 నిమిషాల అనంతరం వీఎంఎస్‌ ఈవ్‌ నుంచి యూనిటీ-22 విడిపోయింది.
 • రాత్రి 8.45 గంటలు
 • అనంతరం భూమి నుంచి 13 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నాక.. యూనిటీ-22 ఇంజిన్‌ ప్రజ్వరిల్లడం ప్రారంభించడంతో రాకెట్‌ వేగం 4 వేల కిలోమీటర్లకు చేరుకున్నది.
 • రాత్రి 8.50 గంటలు
 • నిర్దేశిత ఎత్తుకు చేరుకున్నాక రాకెట్‌ ఇంజిన్‌ ఆగిపోయింది. వ్యోమనౌక ప్రయాణం కొనసాగింది.
 • రాత్రి 9.00 గంటలు
 • భూవాతావరణానికి, రోదసికి సరిహద్దుగా భావించే కర్మాన్‌ రేఖ (భూమి నుంచి 53 మైళ్లఎత్తు) వద్దకు వ్యోమనౌక చేరుకున్నది. ఇక్కడ యూనిటీ-22లోని ఆరుగురు వ్యోమగాములు నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు భారరహిత స్థితిలో ఉన్నారు. రోదసి నుంచి భూమి అందాలను వీక్షించారు.
 • రాత్రి 9.10 గంటలు
 • అంతరిక్ష యాత్ర పూర్తిచేసుకున్న వ్యోమనౌక ‘ఫెదర్‌ కాన్ఫిగరేషన్‌ మోడ్‌’లోకి మారింది.
 • రాత్రి 9.15 తర్వాత ై
 • గ్లెడర్ల సాయంతో స్పేస్‌ షటిల్‌గా మారిన వ్యోమనౌక సురక్షితంగా భూమిని చేరుకున్నది.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విను వీధిలో విహార వాణిజ్యం
విను వీధిలో విహార వాణిజ్యం
విను వీధిలో విహార వాణిజ్యం

ట్రెండింగ్‌

Advertisement