హనోయి: ఒక కుటుంబం భోజనం చేస్తుండగా సీలింగ్ ఫ్యాన్ ఊడి పడింది. దీంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. వియత్నాంలో జరిగిన ఈ ఘనటకు సంబంధించిన వీడియోను వైరల్‌హాగ్ అనే యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేసింది.
ఒక కుటుంబంలోని ఆరుగురు నేలపై పరిచిన వస్త్రంపై కూర్చొని భోజనం చేస్తున్నారు. ఇందులో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొంత సేపటికి పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ పెద్ద శబ్దం చేసింది. ఒక బాలుడు దీనిని గ్రహించి తలపైకి ఎత్తి చూశాడు. ఇంతలో ఉన్నట్టుండి ఆ ఫ్యాన్ ఊడి ఆ బాలుడు, మరో ఇద్దరు వ్యక్తుల మధ్యలో పడింది. వెంటనే లేచిన తల్లి ఆ బాలుడ్ని దగ్గరకు తీసుకుని ఏమైనా గాయమైందా అని పరిశీలించింది. మరోవైపు మిగతా వారంతా షాక్ అయ్యారు.
ఈ ఏడాది జూలై 8న వియత్నాంలోని బాక్ నిన్హ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆ ఇంట్లోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. వైరల్‌హాగ్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోను పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. దీనిని మిరాకిల్‌గా నెటిజన్లు పేర్కొన్నారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.