ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 11, 2020 , 02:15:21

రాజకీయం పోషించిన రౌడీ

రాజకీయం పోషించిన రౌడీ

  •  నేతల అండదండలతో గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన వికాస్‌దూబే  
  •  మంత్రిని హత్య చేసినా అభియోగాలు నమోదు కాలేదు 
  •  60కిపైగా కేసులు.. దేంట్లోనూ శిక్ష పడలేదు 

లక్నో: వీధి రౌడీగా జీవితం ప్రారంభించిన వికాస్‌ దూబే రాజకీయ నాయకుల అండదండలతో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు. అతడిపై హత్యలు, దోపిడీలు, భూకబ్జాలు, కిడ్నాప్‌లు తదితర 60కిపైగా కేసులు ఉన్నాయి. ప్రధానమైన ఏ కేసులోనూ దూబెకు జైలుశిక్ష పడలేదు. చిన్నాచితకా కేసుల్లో కొద్దిరోజులు జైలుకు వెళ్లినా అక్కడి నుంచే తన నేరసామ్రాజ్యాన్ని నడిపేవాడు. 2001లో స్వతంత్ర మంత్రి హోదాలో ఉన్న బీజేపీ నేత సంతోశ్‌శుక్లాను శివ్లీ పోలీస్‌స్టేషన్‌లోనే హత్యచేశాడు. అయినా అతడిపై అభియోగాలు మోపలేకపోయారు. 2000లో కాన్పూర్‌లో తారాచంద్‌ ఇంటర్‌ కాలేజీ మేనేజర్‌ సిద్ధేశ్వర్‌ పాండేను హత్యచేయించాడు. అదే ఏడాది రామ్‌బాబు యాదవ్‌ అనే వ్యక్తిని హత్యచేశాడు. 2004లో జరిగిన దినేశ్‌దూబె అనే వ్యాపారి హత్యకేసులో కూడా వికాస్‌దూబే హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. 2013లో కూడా వికాస్‌ పలు హత్యలు చేయించినట్టు పోలీసులు తెలిపారు. 2018లో అనురాగ్‌ అనే తన బంధువును హత్యచేయించాడు. వికాస్‌, అతడి సోదరుడు దీపు దూబేలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని బిక్రు గ్రామస్థులు తెలిపారు. పోలీసుల హత్య తర్వాత వికాస్‌కు రాజకీయ నాయకులతోగల సంబంధాలపై సోషల్‌మీడియాలో పలుఫొటోలు వైరల్‌ అయ్యాయి.  ఇద్దరు మంత్రులతో దూబే సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకొచ్చాయి. వికాస్‌ దూబే, ఆయన భార్య రిచాదూబేలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 

దూబే ఎన్‌కౌంటర్‌తో బేడీలపై చర్చ 

యూపీలో గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో నేరస్థుల చేతికి బేడీలు వేయాలా వద్దా అన్న చర్చ మళ్లీ మొదలైంది. గతంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన నియమాల ప్రకారం పోలీసుల అదుపులో ఉన్నవారు, విచారణ ఎదుర్కొంటున్నవారు, నేర నిరూపణ అయినవారికి అకారణంగా బేడీలు వేయకూడదు. ఒకవేళ ముద్దాయి పారిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని భావిస్తే మేజిస్ట్రేటు అనుమతి తీసుకొని బేడీలు వేయాలి. వికాస్‌ దూబేకు బేడీలు వేశారా లేదా అన్నది తెలియనప్పటికీ అతడు పారిపోయేందుకు ప్రయత్నించాడని పోలీసులు చెప్పటంతో మరోసారి బేడీలపై చర్చ మొదలైంది.


logo