మంగళవారం 19 జనవరి 2021
International - Jan 05, 2021 , 11:59:39

కొత్త రికార్డు.. భార‌త్ వ‌ద్ద బియ్యం కొన్న వియ‌త్నాం

కొత్త రికార్డు.. భార‌త్ వ‌ద్ద బియ్యం కొన్న వియ‌త్నాం

హైదరాబాద్‌: బియ్యం ఎగుమ‌తుల్లో వియ‌త్నాం దేశానిది మూడ‌వ స్థానం. కానీ తొలిసారి ఇండియా వ‌ద్ద ఆ దేశం బియ్యం కొనుగోలు చేసింది.  గ‌త కొన్ని ద‌శాబ్దాల్లో ఇలాంటి వ్యాపారం జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి అని ప‌రిశ్ర‌మ అధికారులు తెలిపారు. ఆసియా దేశాల్లో ఆహార ఉత్ప‌త్తుల స‌ర‌ఫ‌రా ఘ‌నీభ‌విస్తున్న నేప‌థ్యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు భావిస్తున్నారు. ఈ ఏడాదిలో ఆహార ఉత్ప‌త్తుల ధ‌ర‌లు భారీగా పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కూడా అనుమానిస్తున్నారు.  బియ్యం ఉత్ప‌త్తిలో థాయిలాండ్‌, వియ‌త్నాం దేశాలు ముందుంటాయి. కానీ ఇటీవ‌ల వియ‌త్నాంలో ధ‌ర‌లు భ‌గ్గుమ‌న్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ దేశం భార‌త్‌పై ఆధార‌ప‌డాల్సి వ‌చ్చిన‌ట్లు రైస్ ఎక్స్‌పోర్టర్స్ సంఘం పేర్కొన్న‌ది. సుమారు 70 వేల ట‌న్నుల బియ్యం దిగుమ‌తి కోసం భార‌తీయ వ్యాపార‌వేత్త‌ల‌తో వియ‌త్నం ఒప్పందం కుదుర్చుకున్న‌ది.

జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి కోసం ఆర్డ‌ర్ వ‌చ్చిన‌ట్లు రైస్ ఎక్స్‌పోర్ట‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు బీవీ కృష్ణా రావు తెలిపారు. 310 డాల‌ర్ల‌కు ఒక ట‌న్ను ఎగుమ‌తి చేసే విధంగా డీల్ జ‌రిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు. అయితే తొలిసారి తాము వియ‌త్నాంకు బియ్యం పంపిణీ చేస్తున్న‌ట్లు చెప్పారు. భార‌త్‌లో ల‌భించే బియ్యానికి త‌క్కువ ధ‌ర ఉంద‌ని, దీని వ‌ల్ల ఎగుమ‌తులు పెరిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు.  క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల వియ‌త్నాంతో పాటు ఇత‌ర ఆసియా దేశాలు ఆహార ధాన్యాల‌ను నిల్వ చేసుకునే ప‌నిలో ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది.  సుమారు 3 లక్ష‌ల ట‌న్నుల బియాన్ని ఆ దేశం నిల్వ చేయ‌నున్న‌ది.