శనివారం 06 జూన్ 2020
International - May 04, 2020 , 01:32:47

వహ్‌.. వియత్నాం!

వహ్‌.. వియత్నాం!

వియత్నాం.. ఆగ్నేయాసియాలోని చిన్న దేశం. జనాభా 9.6 కోట్లు. చైనాతో 1,300 కి.మీ. మేర సరిహద్దు. కానీ ఇప్పటివరకు ఆ దేశంలో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. అవును.. మీరు చదివింది నిజమే. ఏకపార్టీ కమ్యూనిస్టు దేశమైన వియత్నాంలో ఇప్పటివరకు కేవలం 271 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అందులోనూ 219 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 52 మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ‘పరిమిత వనరులతో’ కరోనా రక్కసిపై అసామాన్య పోరాటం సాగిస్తున్న వియత్నాం.. ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నది.

  • కరోనా మహమ్మారికి సమర్థంగా అడ్డుకట్ట
  • చైనాను ఆనుకుని ఉన్నా ఒక్క మరణమూ లేదు
  • కేసులు 271 మాత్రమే.. 219 మంది డిశ్చార్జి

నేషనల్‌ డెస్క్‌:అమెరికా, బ్రిటన్‌ వంటి సంపన్న దేశాల్లో లక్షల కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తుంటే.. అరకొర వైద్య వసతులు కలిగిన వియత్నాం మాత్రం కరోనాకు సమర్థంగా కళ్లెం వేయగలిగింది. చైనాతో సుదీర్ఘ సరిహద్దు, భారీ వాణిజ్యం దృష్ట్యా వైరస్‌ ముప్పును ముందుగానే పసిగట్టింది. వైరస్‌కు పుట్టినిల్లయిన వుహాన్‌ నగరంలో కేవలం 27 కేసులు నమోదైన డిసెంబర్‌ మధ్యనాటికే, వియత్నాం వైరస్‌ నియంత్రణకు మార్గదర్శకాలను జారీచేసింది. సరిహద్దుల్లో నిఘాను పెంచింది. దవాఖానలు, వైద్య విభాగాలను అప్రమత్తం చేసింది. వుహాన్‌ నుంచి తిరిగి వచ్చిన బృందంలో ఒకరికి వైరస్‌ నిర్ధారణ కావడంతో జనవరి 23న ఆ దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. ఏప్రిల్‌ 17 నుంచి వారంపాటు ఒక్కకేసు కూడా నమోదుకాలేదు. 24న రెండు కేసులు నమోదుకాగా, మళ్లీ   ఆదివారం (మే 3న) ఒక్క కేసు నమోదైంది. 

కలిసొచ్చిన గత అనుభవాలు..

2003లో సార్స్‌ మహమ్మారి, 2008లో ఏసియన్‌ ఫ్లూను ఎదుర్కొన్న అనుభవంతో వియత్నాం పకడ్బందీగా వైరస్‌ నియంత్రణ చర్యలను చేపట్టింది. ఫిబ్రవరి ప్రారంభంలోనే చైనా నుంచి విమాన రాకపోకలను నిలిపివేసింది. స్కూళ్లను మూసివేసింది. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, క్వారంటైన్‌ చర్యలను పక్కాగా అమలుపరిచింది. కరోనా రోగిని నేరుగా కలిసిన వ్యక్తులను గుర్తించేందుకే మిగిలిన దేశాలు సతమతమవుతుంటే.. వియత్నాం మాత్రం నేరుగా కలిసిన వ్యక్తిని మొదలుకుని నాలుగు దశల వరకు బాధితులను గుర్తించి, పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌లో ఉంచింది.  కాంటాక్ట్‌ ట్రేసింగ్‌కు విస్తృతంగా సెక్యూరిటీ నెట్‌వర్క్‌ను, మిలిటరీని వినియోగించుకున్నది.  

వివాదాస్పదమే కానీ సమర్థవంతం

కరోనా నియంత్రణకు ప్రభుత్వం రూపొందించిన రెండు యాప్‌లు సత్ఫలితాలిచ్చినప్పటికీ వివాదాస్పదమయ్యాయి. కరోనా లక్షణాలు ఏవైనా కనిపిస్తే ప్రజలు ఎన్‌సీంవీఐ అనే యాప్‌ ద్వారా రిపోర్ట్‌ చేయవచ్చు. కరోనా సోకిన వ్యక్తులు, క్వారంటైన్‌లో ఉన్నవారు, కోలుకున్న వ్యక్తులు ‘స్మార్ట్‌ సిటీ’ అనే మరో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వారు క్వారంటైన్‌ కేంద్రాల నుంచి 20-30 మీటర్ల దూరం వెళ్లినా వెంటనే అధికారులకు సమాచారం వెళ్తుంది. అయితే సమాచార గోప్యతపై హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బాధితుల వివరాలు సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యాయి. 

ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభం..

గత నెల ప్రారంభంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించిన వియత్నాం.. ఇప్పుడిప్పుడే ఆర్థిక కార్యకలాపాలను పునఃప్రారంభిస్తున్నది. దుకాణాలు, రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. బస్సులు, ట్యాక్సీలు, దేశీయ విమాన రాకపోకలు సాగుతున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో తప్ప మిగిలిన చోట్ల సోషల్‌ డిస్టెన్సింగ్‌ (నిర్ణీత దూరం) నిబంధనలను ఎత్తివేశారు. అయితే పెద్ద సంఖ్యలో గుమిగూడడంపై ఇప్పటికీ నిషేధం ఉన్నది. 

 క్వారంటైన్‌ వసతులు భేష్‌

ఒక వ్యక్తికి కరోనా సోకినట్లు తేలితే, అతడితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ (వైరస్‌ లక్షణాలు లేకపోయినప్పటికీ) కూడా అధికారులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. ఇప్పటివరకు సుమారు లక్ష మందిని క్వారంటైన్‌లో ఉంచారు. అక్కడి గదులు, భోజన, వైద్య సదుపాయాలు, పరీక్షలకు సంబంధించిన ఫొటోలపై ఫేస్‌బుక్‌లో లైక్స్‌ వెల్లువెత్తుతుండడం విశేషం. మరోవైపు, కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచే చర్యల్లో భాగంగా చేతులు శుభ్రం చేసుకోవడంపై వైద్య శాఖ రూపొందించిన పాట బాగా ప్రాచుర్యం పొందింది.


logo