శనివారం 30 మే 2020
International - Apr 14, 2020 , 11:06:28

చైనా, యూకేను మించిన న్యూయార్క్‌

చైనా, యూకేను మించిన న్యూయార్క్‌

  • లక్ష దాటిన బాధితులు.. 6,900కు పెరిగిన మృతులు 
  • ఆర్థిక కార్యకలాపాలు పునః ప్రారంభిస్తానంటున్న గవర్నర్‌ 

న్యూయార్క్‌: అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ నగరం కరోనాకు అడ్డాగా మారింది. ఒక్క నగరంలోనే బాధితుల సంఖ్య లక్ష దాటింది. చైనా, బ్రిటన్‌ కన్నా ఈ సంఖ్య చాలా ఎక్కువ. న్యూయార్క్‌ అధికారుల సమాచారం ప్రకారం నగరంలో ఆదివారం ఒక్కరోజే 5,695 కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 1,04,410కు పెరిగింది. మృతుల సంఖ్య 6,898గా నమోదైంది. అమెరికా మొత్తం కేసుల్లో 20% కేసులు న్యూయార్క్‌లోనే తేలాయి. రాష్ట్రంలో కరోనా ఒక్కరోజులోనే 758 మందిని పొట్టన పెట్టుకున్నదని న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్యూ క్యూమో పేర్కొన్నారు. ఓవైపు కరోనా విజృంభిస్తున్నదని చెప్తూనే.. ఆర్థిక కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

ఐదున్నర లక్షలు దాటిన కేసులు 

అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య ఐదున్నర లక్షలు దాటింది. మృతుల సంఖ్య సైతం అనూహ్యంగా పెరిగింది. ఇప్పటివరకు 22 వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల కేసులు నమోదుకాగా, ఇందులో 30 శాతం ఒక్క అమెరికాలోనే ఉన్నాయి.  

అంతా అబద్ధం: ట్రంప్‌ 

కరోనా గురించి నిపుణులు ముందే హెచ్చరించినా ట్రంప్‌ పట్టించుకోలేదని,  ఆయన ఒంటెద్దు పోకడల వల్లే ఈ దుస్థితి తలెత్తిందంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో వచ్చిన కథనంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మండిపడ్డారు. ‘ఆ పేపర్‌ మాదిరిగానే వార్త కూడా నకిలీ’ అంటూ ట్వీట్‌ చేశారు. 


logo