బుధవారం 02 డిసెంబర్ 2020
International - Nov 16, 2020 , 15:10:36

క్రిస్మ‌స్‌కు ముందే వ్యాక్సిన్.. !

క్రిస్మ‌స్‌కు ముందే వ్యాక్సిన్.. !

హైద‌రాబాద్‌: క్రిస్మ‌స్ పండుగ‌కు ముందే అవ‌స‌ర‌మైన వారికి కోవిడ్ టీకా అందుతుంద‌ని బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. తాజాగా క‌రోనా వైర‌స్ సోకిన ఎంపీని క‌లిసిన బోరిస్ జాన్స‌న్ కూడా క‌రోనా పరీక్ష‌లో పాజిటివ్‌గా తేలారు. దీంతో ఆయ‌న ప్ర‌స్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నారు.  ఈ నేప‌థ్యంలో ఆయ‌న కొన్ని అభిప్రాయాలు వినిపించారు.  ప్ర‌స్తుతం ఆరోగ్యం బాగానే ఉంద‌ని, అయితే అత్యంత అవ‌స‌ర‌మైన వారికి వ్యాక్సిన్‌ను.. బ‌హుశా క్రిస్ట‌మ‌స్ లోపే అందించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని బోరిస్ జాన్స‌న్ తెలిపారు.  కోవిడ్‌19పై జ‌రుగుతున్న అన్ని స‌మావేశాల‌కు వ‌ర్చువ‌ల్‌గా హాజ‌రుకానున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.  ఛాన్స‌ల‌ర్ రిషి సునాక్‌తో స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు బోరిస్ తెలిపారు.  

భారీ ట్ర‌య‌ల్స్‌..

మ‌రోవైపు బ్రిట‌న్‌లో కొత్త‌గా భారీ స్థాయిలో కోవిడ్ టీకా ట్ర‌య‌ల్స్ ప్రారంభం అయ్యాయి.  ఇంత భారీ ట్ర‌య‌ల్ నిర్వ‌హించ‌డం బ్రిట‌న్‌లో ఇది మూడ‌వ‌సారి.  బెల్జియంకు చెందిన జాన్‌సెన్ కంపెనీ ఈ ట్ర‌య‌ల్‌ను డిజైన్ చేసింది.  సాధార‌ణ‌ కోల్డ్ వైర‌స్‌ను జ‌న్యుమార్పిడి చేసి.. రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే విధంగా టీకాను త‌యారు చేశారు. బ్రిట‌న్‌లో సుమారు ఆరు వేల మందిపై ట్ర‌య‌ల్స్ జ‌ర‌గ‌నున్నాయి. ఇత‌ర దేశాలను క‌లిపితే ఆ సంఖ్య  30వేలు దాట‌నున్న‌ది. రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో వాలంటీర్లకు రెండు డోసుల‌ను ఇవ్వ‌నున్నారు.  ఇప్ప‌టికే వాలంటీర్ల‌కు జాన్‌సెన్ సంస్థ ఓ డోసు ఇచ్చింది. ఒక‌వేళ రెండ‌వ డోసు ఇస్తే, దాని వ‌ల్ల బ‌ల‌మైన‌, సుదీర్ఘ‌మైన రోగ‌నిరోధ‌క శ‌క్తి వ‌స్తుందా లేదా అని ప‌రిశీలించ‌నున్నారు. అయితే ఈ ఫ‌లితాలు వెలుబ‌డ‌డానికి ఆరు లేదా 9 నెల‌ల స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ది.  

క‌రోనా పాజిటివ్ తేలిన ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌.. నిబంధనల ప్రకారం 10 రోజులపాటు ఇంటి నుంచే పరిపాలనను కొనసాగిస్తానని చెప్పారు. ఈమేరకు ఆయన ఓ ట్వీట్ కూడా చేశారు. కరోనా రోగిని కలిసిన ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కరోనా లక్షణాలు లేవని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి చెప్పారు. ప్ర‌ధాని బోరిస్‌కు ఏప్రిల్‌లో కరోనా సోకింది. దీంతో దవాఖానాలో చేరిన ఆయన ఐసీయూలో చికిత్స చేయించుకున్న తర్వాత కోలుకున్నారు.