మంగళవారం 19 జనవరి 2021
International - Dec 28, 2020 , 01:38:09

టీకా Xతూటా

టీకా Xతూటా

పేద దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ కత్తి మీద సాము

యుద్ధాలు.. అస్థిరత.. వదంతులతో అవాంతరాలు

పాక్‌లో 8 ఏండ్లలో 100 మంది సిబ్బంది హత్య

వ్యాక్సినేషన్‌ కొనసాగకుండా మిలిటెంట్ల హింస

ఇప్పటికీ పాక్‌, అఫ్ఘన్‌, నైజీరియాలో పోలియో

రష్యా, అమెరికాతో పాటు యూరప్‌లో కొన్ని దేశాల్లో కరోనా టీకా పంపిణీ మొదలైంది. పెద్ద దేశాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సజావుగానే సాగుతుండవచ్చు. కానీ, పేద దేశాల్లో ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. టీకాలు కొనడం, భద్రపరచడం, అధ్వాన్న రహదారులు, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని విద్యుత్తు సరఫరా, మౌలిక సదుపాయాల లేమి... ఇవి మాత్రమే పేద దేశాల సమస్య కాదు. యుద్ధాలు, అస్థిరత, వదంతులు మొదలైనవి టీకా పంపిణీలో ఎదురయ్యే పెను సవాళ్లు. 

వదంతులకు పరాకాష్ట

వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పరిస్థితులు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉన్నాయి. చాలా పేద దేశమైన హైతీ... ఇంకా టీకా ప్రణాళికను ప్రకటించలేదు. కరోనా మరణాలను పెంచి, విదేశాల నుంచి మరిన్ని నిధులను పొందేందుకు దవాఖానాల్లో ప్రజలకు ప్రాణాంతక ఇంజెక్షన్లు ఇస్తారన్న వదంతులు అక్కడ తిరుగుతున్నాయి. ఆఫ్రికా ఖండం వ్యాప్తంగా 54 దేశాల్లోని 130 కోట్ల మందికి టీకా వేసే కార్యక్రమానికి ఆఫ్రికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాలు (ఏసీడీసీపీ) అనే సంస్థ నేతృత్వం వహిస్తున్నది. తిరుగుబాటుదారులు, గనులపై ఆధిపత్యం కోసం పోరాడే సాయుధ ముఠాల వల్ల గతంలో కాంగోలో ఎబోలా టీకా వేయడానికి అవాంతరాలు ఎదురయ్యాయి. ప్రజల్ని చంపేయడానికే ఎబోలా టీకా వేస్తున్నారన్న వదంతులు భయకంపితులను చేశాయి. యెమన్‌లో అంతర్యుద్ధం వల్ల గత ఆరేండ్లలో వైద్య వ్యవస్థ కుప్పకూలిపోయింది. ప్రపంచంలో ఇంకా పోలియో నిర్మూలన జరుగని దేశాలు పాకిస్థాన్‌, అఫ్ఘనిస్థాన్‌, నైజీరియాలే. దీన్ని బట్టి ఈ దేశాల్లో వ్యాక్సినేషన్‌కు ఉన్న ప్రతికూల పరిస్థితులు అర్థమవుతాయి.

టీకా వేయనివ్వరు!

అది పాకిస్థాన్‌లోని బజౌర్‌ గిరిజన ప్రాంతం. ఆరిఫుల్లాఖాన్‌ ఒక చిన్నారికి పోలియో వ్యాక్సిన్‌ వేసి పంపించాడో లేదో... దగ్గర్లోని కొండ వైపు నుంచి తూటాల వర్షం మొదలైంది. ఈ ఘటనలో ఆరిఫుల్లాఖాన్‌ బాల్య స్నేహితుడు రుహొల్లా మరణించాడు. పాక్‌లో వ్యాక్సిన్లు వేయడం ప్రాణాలతో చెలగాటమే. ముస్లిం పిల్లలను భవిష్యత్తులో పిల్లలు కలగకుండా చేయడానికి పశ్చిమ దేశాలు చేస్తున్న కుట్రే పోలియో వ్యాక్సిన్‌ అని మిలిటెంట్లు, మత ఛాందసవాదులు ప్రచారం చేస్తుంటారు. 2012 నుంచి టీకా వేసే కార్యక్రమాల్లో పాల్గొన్న 100 మంది ఆరోగ్య, భద్రతా సిబ్బంది హత్యకు గురయ్యారు. ఇది ఆసియా, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, లాటిన్‌ అమెరికాలో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు కరోనా టీకా పంపిణీలో ఎదుర్కోబోయే సవాళ్లకు ఉదాహరణ. 

విదేశీయులకు జపాన్‌ ‘నో’ ఎంట్రీ

టోక్యో: బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్‌ పట్ల జపాన్‌ అప్రమత్తమైంది. విదేశీయులను దేశంలోకి అనుమతించబోమని వెల్లడించింది. సోమవారం నుంచి డిసెంబర్‌ 31 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వివరించింది. బ్రిటన్‌, దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విదేశీయులను దేశంలోకి రాకుండా నిషేధం విధిస్తూ జపాన్‌ ఇటీవలే నిర్ణయం తీసుకున్నది. 

గర్భస్థ శిశువుకు యాంటీబాడీలు తక్కువే

బోస్టన్‌: మూడో త్రైమాసికంలో (7-9 నెలలు) ఉన్న గర్భిణికి కరోనా సోకితే, వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఆమె శరీరంలో తయారైనప్పటికీ అవన్నీ గర్భంలోని పిండానికి సరఫరా కాలేవని తేలింది. అమెరికాలోని మసాచుసెట్స్‌ దవాఖాన శాస్త్రవేత్తలు ఈ విషయం వెల్లడించారు. 

కరోనా నుంచి 100% రక్షణ!

లండన్‌: బ్రిటన్‌కు చెందిన ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌.. కరోనా నుంచి 100 శాతం రక్షణ కల్పిస్తుందని ఆస్ట్రాజెనెకా సీఈవో పాస్కల్‌ సోరియట్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ సామర్థ్యానికి సంబంధించి తాము విన్నింగ్‌ ఫార్ములాను కనుగొన్నామని ఆదివారం సండే టైమ్స్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఫైజర్‌-బయోఎన్‌టెక్‌, మోడెర్నా టీకాలకు సమానంగా తమ వ్యాక్సిన్‌ పనిచేయగలదని చెప్పారు.

ఈయూలో వ్యాక్సినేషన్‌ 

రోమ్‌: వైరస్‌ ముప్పు ఎక్కువగా ఉన్నవారికి కరోనా టీకా వేసేందుకు యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) దేశాలు ఆదివారం వ్యాక్సినేషన్‌ను ప్రారంభించాయి. పలుదేశాల్లో హెల్త్‌కేర్‌ వర్కర్లు, వృద్ధులు, రాజకీయ నాయకులు టీకాలు వేసుకొన్నారు. 27 సభ్యదేశాలు ఉన్న ఈయూలో మొత్తం 45 కోట్ల మందికి టీకా వేయనున్నారు. వ్యాక్సినేషన్‌ కోసం ఫైజర్‌ టీకా వినియోగిస్తున్నారు. 

6 నెలల తర్వాత.. 20 వేల కంటే దిగువకు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. దాదాపు 6 నెలల తర్వాత ఒక్క రోజులో 20 వేల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. శనివారం 18,732 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 279 మంది మరణించారు. కాగా, సోమవారం నుంచి మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదుగురు ఎమ్మెల్యేలకు, 61 మంది సిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది.