ఆదివారం 24 జనవరి 2021
International - Dec 15, 2020 , 02:43:17

అమెరికాలో టీకా స్టార్ట్‌

అమెరికాలో టీకా స్టార్ట్‌

  • న్యూయార్క్‌  నర్సు శాండ్రాకు మొదటి వ్యాక్సిన్‌
  • కరోనా అంతానికి ఇది ఆరంభం 
  • న్యూయార్క్‌ గవర్నర్‌ అండ్రూ క్యూమో
  • నేను కూడా టీకా వేసుకుంటా
  • ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది
  • ఫైజర్‌ సీఈవో ఆల్బర్ట్‌ బోర్లా
  • బ్రిటన్‌లో సాధారణ ప్రజలకు టీకా
  • సోమవారం నుంచే పంపిణీ

న్యూయార్క్‌: కరోనా వల్ల ప్రపంచంలోనే అత్యంత తీవ్రంగా ప్రభావితమైన అమెరికాలో టీకా వేసే ప్రక్రియ(వ్యాక్సినేషన్‌) ప్రారంభమైంది. ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ సంస్థలు కలిసి అభివృద్ధి చేసిన కరోనా టీకాను సోమవారం నుంచి హెల్త్‌కేర్‌ వర్కర్లకు ఇవ్వడం మొదలుపెట్టారు. న్యూయార్క్‌లో నర్సుగా పనిచేస్తున్న శాండ్రా లిన్సే మొట్టమొదటి డోసు టీకా తీసుకున్నారు. లాంగ్‌ ఐల్యాండ్‌ జ్యూయిష్‌ సెంటర్‌లో టీకా వేసుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఈరోజు చాలా ఆశాభావంతో ఉన్నాను. మానవ చరిత్రలోనే అత్యంత బాధాకర ఘట్టానికి ముగింపు పలకడానికి ఈ రోజే ఆరంభం’ అని ఆమె భావోద్వేగంతో చెప్పారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని న్యూయార్క్‌ గవర్నర్‌ అండ్రూ క్యూమో లైవ్‌స్ట్రీమ్‌ ద్వారా పర్యవేక్షించారు. ‘ఇది ఆధునిక కాలపు యుద్ధరంగం. ఈ యుద్ధంలో పోరాటానికి టీకానే ఆయుధం. టీకా తయారుచేసిన హీరోలందరికీ నా కృతజ్ఞతలు. టీకానే ఈ యుద్ధానికి ముగింపు పలుకుతుంది. కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసకాండలో ఇది చివరి అధ్యాయం. వైరస్‌ అంతానికి ఇది ఆరంభం’ అని వ్యాఖ్యానించారు. తాను కూడా కరోనా టీకా వేసుకోనున్నట్టు ఫైజర్‌ కంపెనీ సీఈవో ఆల్బర్ట్‌ బోర్లా చెప్పారు. ‘టీకాను తయారు చేసిన సంస్థ సీఈవో టీకా వేసుకుంటే ప్రజలకు టీకాపై విశ్వాసం పెరుగుతుంది’ అని అన్నారు. అంతకుముందు ఫైజర్‌ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ బాక్సులు మిషిగన్‌లోని ఫైజర్‌ సంస్థ ప్రధాన కర్మాగారం నుంచి లారీల్లో బయల్దేరాయి. 50 రాష్ర్టాల్లోని నిర్ణీత 636 ప్రాంతాలకు ఈ లారీలు చేరుకోనున్నట్టు అధికారులు తెలిపారు. తొలి విడుతలో 1,84,275 బాక్సులను పంపినట్టు, మరో దఫాలో 3,90,000 బాక్సులను పంపబోతున్నట్టు వెల్లడించారు. ఒక్కో బాక్సులో ఐదు టీకా డోసులు ఉంటాయన్నారు. ఈ వారంలో 29 లక్షల టీకా డోసులను, ఈ ఏడాది చివరినాటికి 1.4 కోట్ల టీకా డోసులను పంపిణీ చేయబోతున్నట్టు చెప్పారు. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమమని అధికారులు భావిస్తున్నారు. అమెరికాలో ఇప్పటివరకూ 1.67 కోట్ల మందికి కరోనా సోకగా, 3.06 లక్షల మంది మరణించారు. అత్యవసర వినియోగం కోసం ఫైజర్‌ టీకాకు.. ఎఫ్‌డీఏ శుక్రవారం అనుమతినిచ్చింది. 

స్పుత్నిక్‌-వి 91.4% ప్రభావవంతం 

కరోనా నుంచి రక్షణ కల్పించడంలో ‘స్పుత్నిక్‌-వి’ 91.4 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన గమలయ కేంద్రం వెల్లడించింది. తీవ్రమైన కరోనా వైరస్‌ కేసుల్లో 100 శాతం సమర్థంగా పనిచేస్తుందని పేర్కొంది. మొదటి డోసు వేశాక 21 రోజులకు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి, ఈ నిర్ధారణకు వచ్చినట్లు వివరించింది.  

బ్రిటన్‌లో కొత్త తరహా కరోనా 

బ్రిటన్‌ రాజధాని లండన్‌లో వైద్యనిపుణులు కొత్తరకమైన కరోనా వైరస్‌ను గుర్తించారు. లండన్‌తో పాటు నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో కేసులు ఒక్కసారిగా పెరగడానికి ఈ వైరసే కారణమని తెలిపారు. దీంతో బ్రిటన్‌ ప్రభుత్వం లండన్‌లో హై అలర్ట్‌ ప్రకటించింది. బుధవారం నుంచి కఠినమైన కొవిడ్‌ ఆంక్షలు అమల్లోకి వస్తాయని పార్లమెంటు వేదికగా ప్రకటించింది. దీంతో లండన్‌లో మళ్లీ దాదాపు లాక్‌డౌన్‌ పరిస్థితులు ఏర్పడనున్నాయి.  

బ్రిటన్‌, కెనడాలోనూ...

బ్రిటన్‌లో వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నది. సాధారణ ప్రజలకు వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా సోమవారం మొదటివిడత టీకాలను పంపిణీ చేశారు. నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌(ఎన్‌హెచ్‌ఎస్‌) ప్రకా రం దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ చోట్ల వ్యాక్సినేషన్‌ డెలివరీ జరిగింది. కొన్ని ప్రాంతాల్లో సోమవారమే వైద్యులు టీకా వేయడం ప్రారంభించారు. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ జరుగుతుందని అధికారులు తెలిపారు. కరోనా ముప్పు ఎక్కువ ఉన్నవారికి బ్రిటన్‌లో ఇప్పటికే టీకా వేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు కెనడాలోనూ సోమవారం నుంచి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది.

అబుదాబిలో కూడా..

అబుదాబి: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో కరోనా వ్యాక్సినేషన్‌ సోమవారం మొదలైంది. రాజధాని అబుదాబిలో నివసిస్తున్న ప్రజలు వ్యాక్సిన్‌ కోసం ఫోన్‌లో అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోవచ్చని, రుసుము వసూలు చేయబోమని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. చైనా ఔషధ సంస్థ సైనోఫార్మ్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను యూఏఈ వినియోగిస్తున్నది. 21 రోజుల వ్యవధిలో రెండు డోసులు వేస్తారు. కరోనా టీకా పంపిణీని ముందుగా ప్రారంభించిన దేశాల్లో యూఏఈ కూడాఒకటి.  logo