గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Sep 03, 2020 , 10:22:09

కోవాక్స్ వ్యాక్సిన్ గ్రూపులో 76 సంప‌న్న‌ దేశాలు

కోవాక్స్ వ్యాక్సిన్ గ్రూపులో 76 సంప‌న్న‌ దేశాలు

హైద‌రాబాద్‌: క‌రోనా మ‌హ‌మ్మారిని నియంత్రించేందుకు ప్ర‌పంచ దేశాలు ఉమ్మ‌డిగా టీకా అభివృద్ధిపై దృష్టి పెట్టాయి.  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో కోవాక్స్ ప్రాజెక్టును చేప‌ట్టారు. కోవాక్స్ టీకాను సొంతం చేసుకునేందుకు సుమారు 76 దేశాలు ఒక్క‌ట‌య్యాయి. వ్యాక్సిన్‌ను‌ అభివృద్ధి చేసి.. అంద‌రికీ అందే విధంగా ఆయా దేశాలు ప‌ర్య‌వేక్షించ‌నున్నాయి. ఈ ప్రాజెక్టుకు గావి వ్యాక్సిన్ గ్రూపు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న‌ది. గావి వ్యాక్సిన్ అలియ‌న్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సీత్ బెర్ల్కీ మీడియాతో ఈ అంశం గురించి మాట్లాడారు. కోవాక్స్ ప్రాజెక్టులో జ‌పాన్, జ‌ర్మ‌నీ, నార్వే లాంటి సంప‌న్న దేశాలు జ‌త‌కూడిన‌ట్లు చెప్పారు.  కోవాక్స్ వ్యాక్సిన్‌ను ప్రొక్యూర్ చేసుకునేందుకు ఆయా దేశాల‌న్నీ ఒప్పందంపై సంత‌కం చేశాయ‌న్నారు. చైనా కూడా త‌మ గ్రూపులో క‌లుస్తుందేమో అన్న సందేహాల‌ను ఆయ‌న వ్య‌క్తం చేశారు.  

జీఏవీఐ, డ‌బ్ల్యూహెచ్‌వో, సీఈపీఐలు సంయుక్తంగా కోవాక్స్ టీకాను అభివృద్ధి చేస్తున్నాయి. అయితే ప్ర‌భుత్వాలు అక్ర‌మంగా ఈ టీకాల‌ను నిల్వ‌ చేయ‌కుండా ఉండేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.  ఎక్కువగా వైర‌స్ ప్ర‌భావానికి గురయ్యే వారికి ముందుగా ఆ వ్యాక్సిన్ ఇవ్వాల‌న్న నియ‌మాన్ని విధించారు. కోవాక్స్ కోసం ధ‌నిక దేశాలు ఫైనాన్స్  చేయ‌నున్నాయి. ఆ దేశాల‌న్నీ సుమారు 92 పేద దేశాల‌కు వ్యాక్సిన్ స‌మానంగా అందే విధంగా చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు బెర్ల్కీ చెప్పారు.  కోవాక్స్ ప్రాజెక్టులో చేర‌డం లేద‌ని అమెరికా స్ప‌ష్టం చేసింది. కోవాక్స్ వ‌ద్ద వ్యాక్సిన్ కొనేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్లు యురోపియ‌న్ యూనియ‌న్ పేర్కొన్న‌ది.  

కోవాక్స్ ప్రాజెక్టును వెల‌క‌ట్ట‌లేని బీమా పాల‌సీ అని డ‌బ్ల్యూహెచ్‌వో పేర్కొన్న‌ది. సుర‌క్షిత‌మైన‌, ప్ర‌భావంత‌మైన కోవిడ్19 వ్యాక్సిన్‌ను అన్ని దేశాలు పొంద‌వ‌చ్చు అని తెలిపింది. ప్రాజెక్టులో చేరాల‌నుకునే దేశాల‌కు సెప్టెంబర్ 18వ తేదీ వ‌ర‌కు గ‌డువు ఇచ్చారు. 2021 చివ‌రి నాటికి సుమారు రెండు మిలియ‌న్ల కోవాక్స్ డోసుల‌ను స‌ర‌ఫరా చేయాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌స్తుతం వ్యాక్సిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ దశ‌లో ఉన్న‌ద‌ని, ఈ ఏడాది చివ‌రి క‌ల్లా పూర్తి డేటా ల‌భిస్తుంద‌ని బెర్ల్కీ చెప్పారు.logo