శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
International - Jan 17, 2021 , 01:52:17

10 కోట్లమందికి వ్యాక్సిన్‌

10 కోట్లమందికి వ్యాక్సిన్‌

100 రోజుల ప్రణాళికను ఆవిష్కరించిన బైడెన్‌

వాషింగ్టన్‌, జనవరి 16: అధ్యక్షుడిగా తాను బాధ్యతలు చేపట్టాక తొలి 100 రోజుల్లో 10 కోట్ల మంది అమెరికన్లకు కరోనా వ్యాక్సిన్‌ వేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ దేశానికి కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిగా విఫలమైందని చెప్పారు. ఈ ఆరోగ్య సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు ఆయన తన ప్రణాళికను ఆవిష్కరించారు. మరింత మంది ప్రాధాన్య గ్రూపుల వారికి తక్షణమే వ్యాక్సిన్‌ చేరువ చేసేందుకు రాష్ర్టాలతో కలిసి పనిచేస్తామన్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్లు ఎవరికి వేస్తున్నారో చాలా మందికి తెలియదని, ఫ్రీజర్లలో వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ అవసరమైనవారికి అవి చేరడం లేదన్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కేంద్రాలను భారీగా పెంచుతామన్నారు.

కమలా హ్యారిస్‌కు పెన్స్‌ శుభాకాంక్షలు

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలాహ్యారిస్‌కు ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ శుభాకాంక్షలు తెలిపారు. అధికార బదిలీకి అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆయన హ్యారిస్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఎన్నికల ఫలితాల తర్వాత వారిద్దరూ నేరుగా మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. అయితే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ సంప్రదాయాన్ని పాటించలేదు. బైడెన్‌ ప్రమాణానికి ఆయన హాజరుకావడం లేదు. 

కొవిడ్‌ టెస్టింగ్‌ సలహాదారుగా విదుర్‌శర్మ

భారత సంతతికి చెందిన వైద్య విధాన నిపుణులు విదుర్‌ శర్మకు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక బాధ్యతలు అప్పగించారు. కొవిడ్‌-19 టెస్టింగ్‌ సలహాదారుగా ఆయనను నియమించారు.  ఒబామా హయాంలోనూ ఆరోగ్య విధాన సలహాదారుగా విదుర్‌ శర్మ సేవలందించారు.  మరోవైపు, కశ్మీర్‌ మూలాలున్న ఇండియన్‌ అమెరికన్‌ సమీరా ఫాజిలీని జాతీయ ఆర్థిక మండలి డిప్యూటీ డైరెక్టర్‌గా బైడెన్‌ నియమించారు. ఒబామా హయాంలో ఇదే ఆర్థిక మండలికి ఫాజిలీ సీనియర్‌ పాలసీ అడ్వైజర్‌గా పనిచేశారు. శ్వేతసౌధంలో కీలక పదవికి ఫాజిల్‌ ఎంపికవడం గర్వంగా ఉన్నదని కశ్మీర్‌లోని ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కశ్మీర్‌కు చెందిన మరో ఇండియన్‌ అమెరికన్‌ అయేషా షా ఇదివరకే బైడెన్‌ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. వైట్‌హౌజ్‌ డిజిటల్‌ స్ట్రాటజీ పార్ట్‌నర్‌షిప్‌ మేనేజర్‌గా ఆమె గత డిసెంబర్‌లో నియమితులయ్యారు. కాగా, ట్రంప్‌ యంత్రాంగంలో సీఎంఎస్‌ అడ్మినిస్ట్రేటర్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇండియన్‌ అమెరికన్‌ సీమా వర్మ తన పదవికి రాజీనామా చేశారు.

VIDEOS

logo