గురువారం 01 అక్టోబర్ 2020
International - Sep 04, 2020 , 01:49:01

టీకాకు సిద్ధం కండి

టీకాకు సిద్ధం కండి

  • అమెరికాలో నవంబరు 1 నుంచి వ్యాక్సిన్‌ పంపిణీ
  • అన్ని రాష్ర్టాలకు ఫెడరల్‌ ప్రభుత్వం లేఖ
  • పంపిణీకి వేగంగా అనుమతులివ్వాలని సూచన
  • రాజకీయ లబ్ధి కోసమేనని పలువురి విమర్శలు

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా టీకా రాజకీయాస్త్రంగా మారింది. అధ్యక్ష ఎన్నికలకు రెండు రోజుల ముందు నవంబరు 1న వ్యూహాత్మకంగా టీకా పంపిణీకి ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇందుకు సిద్ధంగా ఉండాలని అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వం అన్ని రాష్ర్టాలను కోరింది. ఈ మేరకు అమెరికాలోని అంటువ్యాధుల నివారణ సంస్థ ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌'(సీడీసీ) సంస్థ డైరెక్టర్‌ రాబర్ట్‌ రైడ్‌ఫీల్డ్‌ ఆగస్టు 27న గవర్నర్లకు లేఖ రాశారు. కరోనా టీకా పంపిణీకి మెక్‌కీసన్‌ అనే సంస్థ సీడీసీతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ సంస్థ రాష్ర్టాల్లో టీకా పంపిణీ అనుమతుల కోసం స్థానిక ప్రభుత్వాలను త్వరలోనే సంప్రదిస్తుందని రాబర్ట్‌ లేఖలో పేర్కొన్నారు. వెంటనే అనుమతులిచ్చి సహకరించాలన్నారు. ఈ ప్రక్రియ మొత్తం నవంబర్‌ 1వ తేదీలోగా పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. వ్యాక్సిన్‌ విడుదలకు సంబంధించి ప్రణాళిక వివరాలను తెలియజేసే పత్రాలను రాష్ర్టాలకు పంపించారు. ఎఫ్‌డీఏ లేదా అత్యవసర వినియోగం కింద ఆమోదం తెలిపిన టీకాలను నవంబరు 1 నుంచి పంపిణీ చేస్తామని చెప్పారు.  వ్యాక్సిన్‌ తొలిడోసు వేసిన కొద్ది వారాల తర్వాత బూస్టర్‌ డోసు ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. మొదట వైద్యులు, హెల్త్‌ కేర్‌ వర్కర్లకు టీకా ఇస్తారు.

రాజకీయ లబ్ధి కోసమే

ఇటీవల ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ నవంబరు 3 నాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అన్నట్టుగానే పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా రాజకీయ కారణాలతోనే ఆదరబాదరాగా టీకా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. టీకాలపై క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి కాలేదని, అప్పుడే ఇలా డెడ్‌లైన్‌లు పెట్టడం, పంపిణీపై ఏర్పాట్లకు ఆదేశాలు ఇవ్వడం ఏంటని వైద్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కీలకమైన మూడో దశ ట్రయల్స్‌ వెల్లడి కాకముందే టీకా వేస్తామని ప్రకటించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా నవంబర్‌ నాటికి కరోనా టీకా సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. 

నవంబరు 1నాటికి 20 లక్షల డోసులు

టీకా పంపిణీలో భాగంగా మొదటి దశలో ఫైజర్‌ టీకాను(వ్యాక్సిన్‌ ఏ) వేయనున్నారు. నవంబరు 1నాటికి ఈ టీకా 20 లక్షల డోసులను సిద్ధం చేయనున్నట్టు ఫెడరల్‌ ప్రభుత్వం తెలిపింది. డిసెంబరులో మరో 30లక్షల డోసులు అందుబాటులోకి రానున్నాయి. అదేసమయంలో నవంబరు చివరినాటికి వ్యాక్సిన్‌ బీ పంపిణీకి ఆమోదం తెలపనున్నారు.  

రిస్క్‌ ఎక్కువగా ఉన్నవారి కోసమే

టీకాలు ప్రయోగ దశలో ఉన్నప్పటికీ సానుకూల ఫలితాలు వచ్చిన కారణంగా రిస్క్‌ ఎక్కువగా ఉన్నవారికి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని కొందరు వైద్య నిపుణులు సూచించారు. డాటా సేఫ్టీ అండ్‌ మానిటరింగ్‌ బోర్డ్‌ అనే స్వతంత్ర సంస్థ ఈ ట్రయల్స్‌పై అధ్యయనం నిర్వహించింది. ఒక వేళ దుష్ప్రభావాలు ఉంటే ట్రయల్స్‌ వెంటనే ఆగిపోయేవని, కానీ ఇంకా జరుగుతున్నాయంటే టీకా బాగా పనిచేస్తున్నట్టేనని తెలిపింది. సంస్థ కూడా రిస్క్‌ ఎక్కువగా ఉన్నవారికి టీకాను అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది.

ప్రస్తుతం అన్ని టీకాలు ట్రయల్స్‌ దశలోనే

అమెరికాలో ప్రస్తుతం అన్ని టీకాలు ట్రయల్స్‌ దశలోనే ఉన్నాయి. తమ టీకా ట్రయల్స్‌ పూర్తయితే అక్టోబర్‌లో ప్రభుత్వం అనుమతి కోరుతామని ఫిజర్‌ సంస్థ ఇటీవల తెలిపింది. మోడెర్నా మాత్రం ఇటీవలే మూడో దశ ట్రయల్స్‌ ప్రారంభించింది. ఆక్స్‌ఫర్డ్‌-అస్ట్రాజెనెకా టీకా అక్టోబరులో అందుబాటులోకి వస్తుందనుకున్నారు. కానీ అమెరికాలో ఇటీవలే మూడో దశ ట్రయల్స్‌ ప్రారంభించారు. దీంతో 2020 చివరికి తమ టీకా అందుబాటులోకి వస్తుందని అస్ట్రాజెనెకా తెలిపింది. తమకు వేగం ముఖ్యమేనని, అదే సమయంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని టీకాను అభివృద్ధి చేస్తున్నామని ఆక్స్‌ఫర్డ్‌ తెలిపింది.

మోడెర్నా, ఫైజర్‌ టీకాలు

ప్రస్తుతం అమెరికాలో మోడెర్నా, ఫైజర్‌ అభివృద్ధి చేస్తున్న టీకాలు మూడో దశ క్లినికల్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయి. తొలి రెండు దశల్లో సానుకూల ఫలితాలు వచ్చాయి. వీటిని వ్యాక్సిన్‌ ఏ, వ్యాక్సిన్‌ బీగా చెప్తున్నారు. ఫైజర్‌ అభివృద్ధి చేస్తున్న టీకానే నవంబరులో ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. అయితే వీటిని పూర్తిగా కొత్త పద్ధతిలో తయారు చేస్తున్నారు. ఇంతకు ముందు టీకాల్లో క్రియాశీలకంగా లేని లేదా బలహీనమైన వైరస్‌లను, ప్రొటీన్‌లను పంపి రోగనిరోధక శక్తిని పెంచేవారు. కానీ ఈ టీకాలను ఆర్‌ఎన్‌ఏ ఆధారంగా పనిచేస్తున్నారు. ఆర్‌ఎన్‌ఏ శరీరంలోకి పోయాక ప్రొటీన్‌ ఉత్పత్తికి సంబంధించిన సిగ్నల్స్‌ను మెదడుకు  పంపుతుంది. తద్వారా ప్రొటీన్‌ ఉత్పత్తితో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇలాంటి కొత్త పద్ధతిలో తయారు చేసిన టీకాను అభివృద్ధి దశలో ఉన్న సమయంలోనే ప్రజలకు ఇవ్వడం రిస్క్‌ అనే చెప్పాలి. 


logo