గురువారం 04 జూన్ 2020
International - Apr 28, 2020 , 15:23:04

90 బిలియ‌న్ డాల‌ర్లు కావాలి

90 బిలియ‌న్ డాల‌ర్లు కావాలి

క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచంలో అనేక దేశాలు పూర్తిగా స్తంభించాయి. వంద‌ల‌కోట్ల మందికి చేయ‌టానికి ప‌ని లేదు. కోట్ల‌మంది పేద‌ల‌కు తిన‌టానికి స‌రైన తిండి కూడా దొర‌క‌టం లేదు. క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచంలోని 40 పేద దేశాల్లో దాదాపు 70 కోట్ల‌మంది తీవ్రంగా ప్ర‌భావితం కానున్నారని ఐక్య‌రాజ్య‌స‌మితి మాన‌వత్వ సంస్థ డైరెక్ట‌ర్ మార్క్ లాకాక్ తెలిపారు. కోవిడ్‌-19 వైర‌స్ ఇంకా పేద దేశాల‌పై పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేద‌ని, మ‌రో మూడు నుంచి ఆరు నెల‌ల్లో అ దేశాల్లో తీవ్రం కావ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు. ఈ వైర‌స్ కార‌ణంగా ఉపాధి కోల్పోయే పేద‌ల‌ను ఆదుకోవాలంటే 90 బిలియ‌న్ డాల‌ర్లు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని ఇది 20 ధ‌నిక దేశాలు ప్ర‌క‌టించిన 8 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఉద్దీప‌న ప్యాకేజీల్లో ఒక్క‌శాత‌మేన‌ని వెల్ల‌డించారు. 

ధ‌నిక దేశాలు త‌మ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను పున‌రుద్ధ‌రించుకొనేందుకు ప్ర‌క‌టించిన ఉద్దీప‌న ప్యాకేజీల్లో ఒక్క‌శాతం వెచ్చించినా 70 కోట్ల‌మందిని ఆక‌లిచావుల నుంచి ర‌క్షించ‌వ‌చ్చ‌ని తెలిపారు. ఈ పేద‌ల ఇప్ప‌టికే స‌హాయాన్ని అందుకుంటున్నార‌ని, అయిన‌ప్ప‌టికీ వారి ఆదాయాలు తీవ్రంగా ప‌డిపోవ‌టంతో ఇప్పుడు పెద్ద‌మొత్తంలో సాయం అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. ఈ పేద‌ల ఆదాయాలు మ‌రీ దారుణంగా ప‌డిపోకుండా కాపాడాలంటే 60 బిలియ‌న్ డాల‌ర్లు అవ‌స‌రం అవుతాయ‌ని తెలిపారు. 


logo