శనివారం 06 జూన్ 2020
International - May 24, 2020 , 00:55:29

కలగా హెచ్‌-1బీ!

కలగా హెచ్‌-1బీ!

  • అమెరికా చట్టసభల ముందుకు వీసాల సవరణ బిల్లు 

వాషింగ్టన్‌: డాలర్‌ డ్రీమ్స్‌ను చెదురగొట్టే మరో అస్ర్తాన్ని అమెరికా ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. ఉద్యోగాల కోసం అమెరికాకు వచ్చే విదేశీయుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ‘హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసా సవరణ బిల్లు’ను రూపొందించింది. దీనిని డెమోక్రాట్‌, రిపబ్లికన్‌ పార్టీలకు చెందిన ప్రతినిధులు శుక్రవారం అమెరికా చట్టసభల ముందు ప్రవేశపెట్టారు. 

బిల్లులోని ప్రధానాంశాలు 

ఈ బిల్లు ప్రకారం అమెరికాలో చదువుకున్న తెలివైన, చురుకైన విదేశీ విద్యార్థులకు హెచ్‌-1బీ వీసాల జారీలో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికా ఉద్యోగుల స్థానంలో హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాదారులను నియమించడంపై నిషేధం విధిస్తారు. తాత్కాలిక శిక్షణ పేరుతో హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాదారులను భారీగా దిగుమతి చేసుకొనే అవుట్‌సోర్సింగ్‌ కంపెనీలపై ఉక్కుపాదం మోపనున్నారు. 50 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న కంపెనీల్లో హెచ్‌-1బీ, ఎల్‌-1 ఉద్యోగుల సంఖ్య 50 శాతానికి మించకుండా పరిమితి విధిస్తారు.  

కనీస వేతన పిడుగు

హెచ్‌-1బీ వీసాదారులకు కనీస వేతనాన్ని 1.50 లక్షల డాలర్లకు పెంచాలని అమెరికా  యోచిస్తున్నది. ప్రస్తుతం వీరి వేతనం సగటున 70వేల నుంచి 90వేల డాలర్ల (రూ.53 లక్షలు-రూ.68లక్షలు) మధ్య ఉన్నది. దీనిని 1.50 లక్షల డాలర్ల (రూ.1.13కోట్లు) నుంచి 2.50 లక్షల డాలర్లుగా (రూ.1.90కోట్లు) నిర్ధారించనున్నారు.  ఇది అమల్లోకి వస్తే కంపెనీలు రెట్టింపు జీతం చెల్లించాల్సి ఉంటుంది. 


logo