బుధవారం 03 జూన్ 2020
International - May 15, 2020 , 12:57:42

చైనా నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు వెనుకకు

చైనా నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు వెనుకకు

వాషింగ్టన్: చైనా నుంచి బిలియన్ల డాలర్ల పెట్టుబడులను (మన కరెన్సీలో అయితే లక్షల కోట్లు) వెనుకకు తీసుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. గురువారం ఫాక్స్ బిజినెస్ న్యూస్‌తో మాట్లాడతున్నప్పుడు చైనా పెట్టుబడుల అంశం ప్రస్తావనకు వచ్చింది. బిలియన్ల కొద్దీ డాలర్లు.. ఔను నిజమే వెనుకకు తీసుకున్నాం అని ట్రంప్ చెప్పారు. అమెరికా పెన్షన్ ఫండ్ నిధులను ప్రభుత్వం పెద్దఎత్తున చైనాలో పెట్టుబడి పెట్టింది. కరోనా వ్యాప్తికి చైనా అబద్ధాలు, దాపరికాలు కారణమయ్యాయని అమెరికా అధ్యక్షుడు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏదోరకంగా చైనాను శిక్షించాలనే ధోరణి అమెరికా ప్రభుత్వంలో కనిపిస్తున్నది. అందులో భాగంగానే భారీస్థాయిలో పెట్టుబడులు ఉపసంహరించినట్టు తెలుస్తున్నది. అలీబాబా వంటి చైనా కంపెనీలు న్యూయార్క్ స్టాక్ ఎక్స్ చేంజీలలో లిస్ట్ అవుతాయి. కానీ అవి తమ సంపాదనల గురించిన వివరాలను వెల్లడించవు. ఇది అమెరికా నిబంధనలకు విరుద్ధం. అలాంటి కంపెనీల చేత నిబంధనలు అమలు చేయిస్తారా? అని అడిగితే కుదరదని ట్రంప్ చెప్పారు. గట్టిగా పట్టుబట్టితే ఆ కంపెనీలు లండన్ స్టాక్ ఎక్స్‌ఛేంజికో, హాంకాంగ్‌కో వెళ్లిపోతామంటాయని నిస్సహాయత వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా కరోనాకు చైనాను బాధ్యురాలిని చేస్తూ ఆరోపణలు సంధిస్తున్న అమెరికా సెనేటర్లపై చర్యకు బీజింగ్ సమాయత్తమవుతున్నట్టు తెలుస్తున్నది. రోజురోజుకూ రెండుదేశాల మధ్య కరోనాపై మాటల యుద్ధం ముదురుతున్నది. అమెరికా సర్కారు పెట్టుబడుల ఉపసంహరణతో అది కొత్తదశలోకి ప్రవేశించినట్టు కనిపిస్తున్నది.


logo