సోమవారం 01 జూన్ 2020
International - May 15, 2020 , 16:40:44

వచ్చే చలికాలం అమెరికాలో ఘోరకలి తప్పదు

వచ్చే చలికాలం అమెరికాలో ఘోరకలి తప్పదు

వాషింగ్టన్: అమెరికా తన కరోనా సంసిద్ధతను మెరుగుపర్చుకోకపోతే వచ్చే చలికాలం ఘోరకలి చూడక తప్పదని సర్కారు గుట్టు బయటపెట్టి పదవి పోగొట్టుకున్న రిక్ బ్రైట్ హెచ్చరించారు. గురువారం ఆయన అమెరికా ప్రతినిధుల సభ కమిటీ ముందు హాజరయ్యారు. బయోమెడికల్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బార్డా) డైరెక్టర్‌గా ఉన్న బ్రైట్‌ను అధ్యక్షుడు ట్రంప్ గతనెల తొలగించారు. కరోనా నివారణకు ప్రభుత్వం తగినంతగా చేయడం లేదని విమర్శించినందుకు గానూ ట్రంప్ తన 'హైర్ అండ్ ఫైర్' విధానంలో భాగంగా తీసిపారేశారు. అమెరికాక సంసిద్ధతలో లోపాల గురించి తెలుసుకునేందుకు ప్రతినిధుల సభ కమిటీ ఆయనను పిలిపించింది. ట్రంప్ తనపై నిప్పులు చెరిగిన కొన్ని గంటల్లోనే బ్రైట్ కమిటీ ముందుకు వచ్చారు. 'మనం అత్యుత్తమ శాస్త్రజ్ఞుల సలహా సంప్రదింపులతో జాగ్రత్తగా ముందుకు అడుగు వేయాలి. మన అవకాశాలు అంతకంతకూ మూసుకుపోతున్నాయి. మన ప్రతిస్పందనను ఇప్పుడు శాస్త్రీయంగా మెరుగుపర్చుకోవడంలో విఫలమైతే మహమ్మారి మరింత దారుణంగా తయారై సుదీర్ఘకాలం కొనసాగుతుందని నా భయం' అని ప్రతినిధుల సభ ఆరోగ్య ఉపసంఘం ముందు వాంగ్మూలం ఇచ్చారు. అమెరికాలో కరోనా 14 లక్షల మందికి సోకింది. 82 వేల మందికిపైగా ఈసరికే మరణించారు. వైద్యులు ధరించే మాస్కులకు తీవ్ర కొరతగా ఉందని వాటిని సరఫరా చేసే కంపెనీ జనవరిలో పంపిన ఈమెయిల్ తాను ఎన్నడూ మరచిపోనని బ్రైట్ పేర్కొన్నారు. 'మనమంతా లోతుగా కూరుకుపోయి ఉన్నాం. ప్రపంచం కూడా అంతే. మనం ఏదో ఒకటి చేయాలి. ఆ సంగతే పైస్థాయి దాకా చేరవేశాను. కానీ సరైన స్పందన రాలేదు' అని చెప్పారు. కరోనా పరీక్షలకు అవసరమైన స్వాబ్ వంటి కనీస అవసరాల విషయంలో అమెరికాకు ఇప్పటికీ ఒక సమగ్ర ప్రణాళిక లేదని బ్రైట్ ఎత్తిచూపారు. కాగా ట్రంప్ బ్రైట్‌ను నిస్పృహకు గురైన అసంతృప్తిపరుడని తిట్టిపోశారు. బ్రైట్ చెప్పివన్నీ ఎప్పుడో చేసేశామని అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం కార్యదర్శి అలెక్స్ అజర్ అన్నారు. మాస్కుల సరఫరాపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఈమెయిల్ పంపిన ప్రెస్టీజ్ అమెరిటెక్ కంపెనీ యజమాని మైక్ బోవెన్‌ను కూడా కమిటీ పిలిపించింది.


logo