శుక్రవారం 10 ఏప్రిల్ 2020
International - Mar 25, 2020 , 14:56:52

చైనాలో వైర‌స్ హంట‌ర్‌.. క‌రోనాపై రిపోర్ట్

చైనాలో వైర‌స్ హంట‌ర్‌.. క‌రోనాపై రిపోర్ట్

హైద‌రాబాద్‌: ఈయ‌న పేరు డాక్ట‌ర్ డ‌బ్ల్యూ. ఇయాన్ లిప్కిన్‌.  ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత వైర‌స్ హంట‌ర్‌గా ఈయ‌న‌కు గుర్తింపు ఉన్న‌ది.  చైనాలో క‌రోనా వైర‌స్ క‌ల్లోలం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఆ వైర‌స్ గురించి స్ట‌డీ చేసేందుకు ఈయ‌న తాజాగా చైనాకు వెళ్లారు.  అమెరికాలో ఉన్న కొలంబియా యూనివ‌ర్సిటీలో సెంట‌ర్ ఫ‌ర్ ఇన్‌ఫెక్ష‌న్ అండ్ ఇన్యూనిటీ ఆఫ్ మెయిల్‌మ్యాన్ స్కూల్‌లో డైర‌క్ట‌ర్‌గా చేస్తున్నాడు.  ఎపిడ‌మాల‌జీలో కూడా ఈయ‌న ప్రొఫెస‌ర్‌.  ప్ర‌స్తుతం క‌రోనా భ‌యంతో ప్ర‌పంచ‌దేశాల‌న్నీ లాక్‌డౌన్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో వైర‌స్ హంట‌ర్ చెప్పే మాట‌లు ఏంటో చూద్దాం. 

17 ఏళ్ల క్రితం కూడా డాక్ట‌ర్ లిప్కిన్ చైనా వెళ్లారు.  అప్పుడు సార్స్ వ్యాధిని ఆయ‌న స్ట‌డీ చేశారు. క‌రోనా గురించి స్ట‌డీ చేసేందుకు ఆయ‌న ప్ర‌స్తుతం గాంగ్‌జావు, బీజింగ్ ప‌ట్ట‌ణాల‌కు వెళ్లారు.  కానీ వైర‌స్ కేంద్ర‌బిందువైన వుహాన్‌కు మాత్రం ఆయ‌న వెళ్ల‌లేదు. అక్క‌డ‌కు వెళ్తే మ‌ళ్లీ అమెరికా వెళ్ల‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌న్న ఉద్దేశంతో ఆ టూర్ చేయ‌లేద‌న్నారు.  అయితే చైనాలో వైర‌స్ వ్యాప్తికి సంబంధించిన రిపోర్ట్‌ను త‌యారు చేస్తున్న‌ది ఈయ‌నే. ఆ నివేదిక‌ను చైనాతో పాటు అమెరికా ప్ర‌భుత్వానికి అందివ్వ‌నున్నారు. 

కరోనా వైర‌స్ చికిత్స కోసం ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి డ్ర‌గ్‌ను అప్రూవ్ చేయ‌లేద‌న్నారు. దీనికి టీకాను త‌యారు చేసేందుకు ఆర్నెళ్ల నుంచి సంవ‌త్స‌రం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌న్నారు.  ఇప్పుడు కేవ‌లం డ‌యాగ్నాస్టిక్ ప‌రీక్ష‌ల కోసమే త‌యారీలు జ‌రుగుతున్నాయ‌న్నారు. ప‌రీక్ష‌లు చేసి ఎవ‌ర్ని ఐసోలేట్ చేయాలి, ఎవ‌ర్నీ చేయ‌కూడ‌ద‌న్న అంశం వ‌ర‌కే మ‌న ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌న్నారు.  మ‌ర‌ణాల రేటును త‌గ్గించేందుకు ఎటువంటి డ్ర‌గ్స్ వాడాలి, యాంటీ బాడీల‌ను ఎలా త‌యారు చేయాల‌న్న ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. 

మ‌రో రెండు లేదా మూడు వారాల్లో డ‌యాగ్నాస్టిక్ ప‌రీక్ష‌లు ముమ్మ‌రంకానున్న‌ట్లు చెప్పారు.  దీని ద్వారా ఎవ‌రు వైర‌స్ బారిన‌ప‌డ్డారు, ఎవ‌రు ఎక్క‌డెక్క‌డ వైర‌స్‌ను వ‌దిలారన్న విష‌యాలు తెలుస్తాయ‌న్నారు. దీని ద్వారానే ఎవ‌ర్ని ఐసోలేట్ చేయాల‌న్న ఒక అంచ‌నా వ‌స్తుంద‌న్నారు.  17 ఏళ్ల క్రితం సార్స్ వ‌ల్ల చైనా తీవ్రంగా న‌ష్ట‌పోయింది. కానీ ఆ పాఠాల నుంచి డ్రాగ‌న్ గుణ‌పాఠం నేర్చుకోలేద‌ని డాక్ట‌ర్ లిప్కిన్ తెలిపారు.  సైన్స్ జ్ఞానం ఉంది, శాస్త్ర‌వేత్త‌లు ఉన్నారు, ల్యాబ‌రేట‌రీలు ఉన్నాయి, డ‌యాగ్నాస్టిక్ టూల్స్ ఉన్నాయి, క‌రోనా వైర‌స్ ఏజెంట్‌ను కూడా త్వ‌ర‌గానే క‌నుగొన్నామ‌ని, కానీ చైనా ఇంకా కొన్ని పాఠాలు నేర్చుకోవాల‌న్నారు.  మొట్ట‌మొద‌టగా దేశంలో ఉన్న వైల్డ్ యానిమ‌ల్ మార్కెట్లును చైనా మూసివేయాల‌ని ఆయ‌న సూచించారు. 

సార్స్ క‌న్నా వేగంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతున్న‌ట్లు డాక్ట‌ర్ లిప్కిన్ అంగీక‌రించారు. సార్స్ క‌న్నా ఎక్క‌వ ఆర్థిక న‌ష్టాన్ని క‌రోనా క‌లిగిస్తుంద‌న్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కానీ మ‌ర‌ణాల సంఖ్య‌లో మాత్రం సార్స్ క‌న్నా త‌క్కువ రేటు నమోదు అవుతుంద‌న్నారు. అయితే ఇవ‌న్నీ అంచ‌నాలు మాత్ర‌మే అని, భ‌విష్య‌త్తును మాత్రం తాను చెప్ప‌లేన‌న్నారు.
logo