ఆదివారం 25 అక్టోబర్ 2020
International - Oct 07, 2020 , 10:43:25

భార‌త టెకీల‌కు జ‌ల‌క్‌.. హెచ్‌1బీ వీసా కోసం కొత్త రూల్స్

భార‌త టెకీల‌కు జ‌ల‌క్‌.. హెచ్‌1బీ వీసా కోసం కొత్త రూల్స్

హైద‌రాబాద్‌: భార‌తీయ టెకీల‌కు ట్రంప్ స‌ర్కార్ షాకిచ్చింది. హెచ్‌1-బీ వీసాల సంఖ్య‌ను త‌గ్గిస్తూ కొత్త ప్ర‌ణాళిక‌ను ప్ర‌క‌టించింది.  విదేశాల‌కు చెందిన నైపుణ్య కార్మికుల‌కు ఇచ్చే వీసాల‌ను ప‌రిమితం చేస్తున్నట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.  క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి వ‌ల్ల దేశంలో ఉద్యోగ క‌ల్పిన భార‌మైనందున ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.  హెచ్‌1బీ వీసా ప్రోగ్రామ్ కింద ఎవ‌రికి వీసా జారీ చేయాల‌ని, వారికి ఎంత జీతం ఇవ్వాల‌న్న‌ అంశాల‌ను త్వ‌ర‌లోనే రిలీజ్ చేయ‌నున్న‌ట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూర్టీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబ‌ర్ అధికారులు వెల్లడించారు. సాధార‌ణంగా ప్ర‌తి ఏడాది అమెరికా ప్ర‌భుత్వం సుమారు 85వేల హెచ్‌1బీ వీసాల‌ను జారీ చేస్తుంటుంది.  అయితే తాజా నియ‌మావ‌ళి ప్ర‌కారం ఆ సంఖ్య‌ను  పావు వంతు త‌గ్గిస్తున్న‌ట్లు హోమ్‌ల్యాండ్ యాక్టింగ్ డిప్యూటీ సెక్ర‌ట‌రీ కెన్ కుసినెల్లి తెలిపారు.  

హెచ్‌1బీ వీసా జారీల ప్రోగ్రామ్‌ను ర‌ద్దు చేస్తూ జూలైలో అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. అమెరికా వ‌ర్క‌ర్ల స్థానంలో త‌క్కువ జీతాల‌కు విదేశీయుల‌ను రిక్రూట్ చేస్తున్న విధానాన్ని ర‌ద్దు చేయాల‌ని ట్రంప్ అప్ప‌ట్లో పేర్కాన్నారు.   హెచ్‌1బీ ప్రోగ్రామ్‌ను  మాజీ అధ్య‌క్షుడు జార్జ్ హెచ్‌డ‌బ్ల్యూ బుష్ స‌మ‌యంలో అమ‌లు చేశారు.  టెకీ రంగంలో ప్ర‌త్యేక‌మైన ఉద్యోగాల కోసం ఈ స్కీమ్‌ను తెచ్చారు.  క్వాలిఫైడ్ వ‌ర్క‌ర్ల కోసం అప్పుడు ఆ వీసాల‌ను ఇచ్చారు.  ఇప్ప‌టికి కూడా ఈ ప్రోగ్రామ్ చాలా అవ‌స‌రం అన్న అభిప్రాయాలు వినిపిస్తూనే ఉన్నాయి. 

హెచ్‌1బీ వీసాల కింద కంప్యూట‌ర్ ప్రోగ్రామ‌ర్లు, అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్‌లు, డేటాబేస్ అడ్మినిస్ట్రేట‌ర్ల‌ను ఉద్యోగంలోకి తీసుకుంటారు. తొలుత  మూడేళ్ల కోసం వారికి వీసా జారీ చేస్తారు.  ఆ త‌ర్వాత వాటిని రెన్యువ‌ల్ చేస్తారు.  అమెరికాలో హెచ్‌1బీ వీసా కింద ఆశ్ర‌యం పొందిన 5 ల‌క్ష‌ల మందిలో ఎక్కువ శాతం భార‌త్‌, చైనా దేశ‌స్థులే ఉన్నారు. హోమ్‌ల్యాండ్ డిపార్ట్‌మెంట్ రూపొందించిన కొత్త రూల్స్‌ను ఈ వారంలో ఫెడ‌ర‌ల్ రిజిస్టార్‌లో ప‌బ్లిష్ చేయ‌నున్నారు.  


logo