శుక్రవారం 07 ఆగస్టు 2020
International - Jul 08, 2020 , 02:10:38

చైనా యాప్‌ల నిషేధంపై అమెరికా పరిశీలన

చైనా యాప్‌ల నిషేధంపై అమెరికా పరిశీలన

వాషింగ్టన్‌: చైనా యాప్‌ల విషయంలో అమెరికా కూడా భారత్‌ బాటలోనే నడవనుందా.. టిక్‌ టాక్‌ సహా పలు చైనా యాప్‌లపై త్వరలోనే నిషేధం విధించనుందా.. అంటే అవుననే తెలుస్తున్నది. చైనా యాప్‌లను తమ దేశంలో నిషేధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో తెలిపారు. టిక్‌టాక్‌ లాంటి సోషల్‌ మీడియా యాప్‌ల వల్ల తమ దేశ భద్రత, సమాచారానికి ముప్పు ఉన్నట్టు తాము భావిస్తున్నామన్నారు. యాప్‌ల నిషేధంపై అధ్యక్షుడు ట్రంప్‌ చాలా పట్టుదలతో ఉన్నారన్నారు. దీనిపై త్వరలోనే ట్రంప్‌ ప్రకటన చేస్తారని తెలిపారు. అమెరికా ఇప్పటికే చైనాకు చెందిన హువావే 5జీ నెట్‌వర్క్స్‌ను తమ దేశంలో నిషేధించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా దీనిపై ఆంక్షలు విధించాలని ఇతర దేశాలను కూడా కోరుతున్నది.

హాంకాంగ్‌లో సేవల్ని నిలిపేసిన ‘టిక్‌టాక్‌'

హాంకాంగ్‌: భారత్‌లో ఇటీవల నిషేధానికి గురైన ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ ‘టిక్‌టాక్‌'.. హాంకాంగ్‌లో తన సేవలను నిలిపివేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. వివాదాస్పద జాతీయ భద్రతా బిల్లుకు చైనా పార్లమెంటు గతవారం ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ పేర్కొంది. కాగా హాంకాంగ్‌లో తమ సేవలను నిలిపివేస్తున్నట్టు సోషల్‌ మీడియా, మెసేజింగ్‌ యాప్స్‌ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, టెలిగ్రామ్‌, గూగుల్‌, ట్విట్టర్‌ పేర్కొన్న మరుసటిరోజే టిక్‌టాక్‌ కూడా ఈ నిర్ణయం తీసుకున్నది.  జాతీయ భద్రతా బిల్లును వ్యతిరేకిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా హాంకాంగ్‌ ప్రజలు చైనాపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆందోళనలు పెరిగే అవకాశం ఉండటంతో ఆయా సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.logo