మంగళవారం 26 మే 2020
International - May 16, 2020 , 12:52:07

ప్రపంచ ఆరోగ్యసంస్థకు నిధులపై మాటమార్చిన అమెరికా

ప్రపంచ ఆరోగ్యసంస్థకు నిధులపై మాటమార్చిన అమెరికా

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకున్నారు. పాక్షికంగా నిధులు అందజేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం రాసిన ఒక లేఖను ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. చైనా ఎంత చెల్లిస్తున్నదో అంచనా వేసి ఆ మేరకు చెల్లిస్తామని ఆ లేఖలో ఉంది. కరోనా మహమ్మారి వ్యాప్తిపై చైనా తప్పుడు ప్రచారాన్ని డబ్ల్యూహెచ్‌వో భుజాన వేసుకు తిరిగిందని ఆరోపిస్తూ ఏప్రిల్ 14న ట్రంప్ అమెరికా చెల్లించాల్సిన నిధులను నిలిపివేశారు. ఆ అంతర్జాతీయ సంస్థపై తమ ప్రభుత్వం సమీక్షిస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. చైనా సమాచారం దాచడం వల్లనే ప్రపంచంలో కరోనా విజృంభించిందని కూడా ట్రంప్ ఆరోపిస్తున్నారు. సకాలంలో గట్టి చర్యలు తీసుకుంటే కరోనా కట్టడి అయ్యేదన్న తీరులో మాట్లాడుతున్నారు. డబ్ల్యూహెచ్‌వో ట్రంప్ ఆరోపణలను కొట్టిపారేసింది. తాము ఎవరివైపూ మొగ్గలేదని తేల్చిచెప్పింది. అటు చైనా కూడా ఏ సమాచారమూ దాచలేదని, అంతా పారదర్శకంగానే వ్యవహరించామని పేర్కొన్నది. డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా అతిపెద్ద దాతగా ఉంటూవస్తున్నది. ఏటా సుమారు 40 కోట్ల డాలర్లు (సుమారు రూ.3 వేల కోట్లు) అందిస్తున్నది. ఇప్పుడు చైనాతో సమానంగా చెల్లిస్తామని అంటున్నది. ఆ ప్రకారం అమెరికా ఇచ్చే విరాళం పదోవంతుకు తగ్గిపోతుందని ఫాక్స్ న్యూస్ తెలిపింది.


logo