శనివారం 30 మే 2020
International - Apr 06, 2020 , 02:30:51

రానున్నది గడ్డుకాలం

రానున్నది గడ్డుకాలం

-భారీగా మరణాలు  సంభవించవచ్చు

-అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరిక

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 5: వచ్చే రెండు వారాలు అమెరికా అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొనబోతున్నదని, ఈ గడ్డుకాలన్ని అధిగమించేందుకు ప్రజలు సిద్ధమవ్వాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. కరోనా కాటుకు రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో మరణాలు సంభవిస్తాయని పేర్కొన్నారు. అమెరికాలో కరో నా బారిన పడిన వారి సంఖ్య 3.20 లక్షలు దాటింది. 9100 మందికిపైగా మృత్యువాతపడ్డారు.  ఈ నేపథ్యంలో శనివారం శ్వేతసౌధంలో ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. ‘అమెరికా అత్యంత గడ్డుకాలాన్ని చవిచూడబోతున్నది. భారీగా ప్రాణనష్టం జరుగువచ్చు. అయితే అమెరికా ఎన్నటికీ షట్‌డౌన్‌ కాకూడదు. దేశాన్ని ధ్వంసం కానివ్వబోం. సమస్య కంటే చికిత్స మరింత దిగజార్చేలా ఉండకూడదు. నేను ముందు నుంచీ ఇదే చెబుతున్నా’ అని వ్యాఖ్యానించారు. 

మోదీజీ.. ఆదుకోండి

కరోనా రోజురోజుకూ కోరలు చాస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. భారత్‌ సాయం కోరారు. మలేరియా వ్యాధి నివారణకు వినియోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తమకు ఎగుమతి చేసి ఆదుకోవాలని భారత ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తిచేశారు. ‘ఈ ఉదయం మోదీతో ఫోన్లో మాట్లాడాను. దేశ అవసరాల నిమిత్తం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఎగుమతి చేయాలని విజ్ఞప్తిచేశాను. దీన్ని భారత్‌ తీవ్రంగా పరిశీలిస్తున్నది’ అని ట్రంప్‌  చెప్పారు. 

ఆ ఔషధాల ఎగుమతిపై నిషేధం

మలేరియా వ్యాధి నిరోధక ఔషధ ఎగుమతులపై భారత ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకొన్నది. తదుపరి ఉత్తర్వులు జారీచేసేంత వరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వంటి మలేరియా నిరోధక ఔషధాల ఎగుమతిపై నిషేధం కొనసాగుతుందని భారత ప్రభుత్వ ఫారిన్‌ ట్రేడ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయం (డీజీఎఫ్‌టీ) శనివారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ నోటిఫికేషన్‌ విడుదలైన కొన్ని గంటలకే ట్రంప్‌.. మోదీకి ఫోన్‌ చేసి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతి చేయాలంటూ కోరడం గమనార్హం. శానిటైజర్లు, వెంటిలేటర్లు, సర్జికల్‌ మాస్కులతోపాటు పలు వైద్య పరికరాల ఎగుమతులను నిషేధిస్తూ భారత ప్రభుత్వం కొన్ని వారాల కిందటే నిర్ణయం తీసుకొన్నది.

న్యూయార్క్‌కు చైనా వెంటిలేటర్లు

కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న న్యూయార్క్‌ను ఆదుకొనేందుకు చైనా ముందుకొచ్చింది. విజ్ఞప్తిచేసిందే తడవుగా చైనా తమకు వెంటిలేటర్లు పంపినట్టు న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో శనివారం వెల్లడించారు. చైనా నుంచి 1,000, ఒరెగాన్‌ రాష్ట్రం నుంచి 140 వెంటిలేటర్లు అందినట్టు ఆయన తెలిపారు. 17 వేల వెంటిలేటర్లను సరఫరా చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరామని, అయితే ప్రభుత్వం వద్ద 10 వేల వెంటిలేటర్లు మాత్రమే ఉండటంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో ఎగుమతి చేయాల్సిందిగా చైనాను కోరినట్టు ఆయన తెలిపారు. 


logo