బుధవారం 28 అక్టోబర్ 2020
International - Sep 25, 2020 , 01:21:10

ఓడిపోయినా.. గద్దె దిగను: ట్రంప్‌

ఓడిపోయినా.. గద్దె దిగను:  ట్రంప్‌

వాషింగ్టన్‌: జగడాలకు మారుపేరుగా నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌ 3న జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను పరాజయం పాలైతే.. ప్రశాంత వాతావరణంలో అధికార మార్పిడికి (విజేతకు అధికారం అప్పగించటానికి) తాను ఒప్పుకోబోనని పరోక్షంగా వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వస్తే సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు. మెయిల్‌ ఓటింగ్‌ (పోస్టల్‌ ఓటింగ్‌) విధానంపై తనకు అనుమానాలు ఉన్నట్టు ట్రంప్‌ పునరుద్ఘాటించారు. శ్వేతసౌధంలో బుధవారం మీడియా సమావేశంలో ట్రంప్‌ మాట్లాడారు. ఎన్నికల్లో ఓడిపోతే అధికారాన్ని (విజేతకు) అప్పగించేందుకు సిద్ధమేనా? అని విలేకర్లు ప్రశ్నించగా.. దానికి ట్రంప్‌ సూటిగా సమాధానం ఇవ్వలేదు. ‘మెయిల్‌ ఓటింగ్‌ విధానాన్ని వదిలిపెట్టాలి. అప్పుడే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతాయి. వచ్చే ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగే అవకాశమే లేదు. నా ప్రభుత్వమే కొనసాగుతుంది’ అని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా తాను గద్దె దిగబోనంటూ ట్రంప్‌ గత కొన్ని నెలలుగా పరోక్ష సంకేతాలిస్తున్నారు.


logo