శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 10, 2020 , 16:30:48

ట్రంప్ తుంటరి ప్రెస్ కాన్ఫరెన్స్

ట్రంప్ తుంటరి ప్రెస్ కాన్ఫరెన్స్

న్యూజెర్సీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై చిందులు తొక్కాడు. తన తప్పును విలేకరులు పట్టుకోవడంతో కోపంతో ఊగిపోయారు. అంతే.. థ్యాంక్యూ ఆల్.. అంటూ విలేకరుల సమావేశం మధ్య నుంచే నిష్క్రమించారు. ఒబామా పరిపాలనలో తాను ఆమోదించిన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాన్ని తన సాధనగా ట్రంప్ పేర్కొన్నారు. దాన్ని మీ సాధనగా ఎలా చెప్పుకుంటారు అని ఓ విలేకరి ప్రశ్నించడంతో.. ట్రంప్ కు కోపమొచ్చింది. సమావేశం మధ్య నుంచే వెళ్లిపోయారు.

న్యూజెర్సీలోని గోల్ఫ్ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. రిటైర్డ్ వర్కర్స్ హెల్త్ కేర్ ప్రోగ్రాం (వెటరన్స్ ఛాయిస్ ప్రోగ్రామ్) లో విజయం సాధించానని చెప్పారు. దశాబ్దాలుగా ప్రజలు దీనిని ఆమోదించాలని కోరుకుంటున్నారని, ఏ అధ్యక్షుడు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఆమోదించలేకపోయారని అన్నారు. మేము చేసి చూపామని చెప్పారు.

అయితే, నిజం ఏమిటంటే మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ కార్యక్రమాన్ని తీసుకువస్తూ 2014 లో సంతకం చేశారు. దీని కింద రిటైర్డ్ కార్మికులు ఏ ప్రైవేట్ దవాఖానలోనైనా చికిత్స పొందవచ్చు. పూర్తి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. వారు ప్రభుత్వ జాబితాలో ఉన్న దవాఖానకే వెళ్లవలసిన అవసరం లేదు. అయితే ఈ కార్యక్రమాన్ని 2018 లో ట్రంప్ విస్తరించారు. తాను వెళ్లిన ప్రతిచోటా ఈ కార్యక్రమాన్ని తానే సృష్టించానని, ఆమోదించానని చెప్పడం ప్రారంభించారు. 50 ఏళ్లుగా ఈ పని చేయడంలో చాలా మంది విఫలమయ్యారని చెప్పుకొస్తున్నారు. పదేపదే ఇదే విషయాన్ని చెప్తుండటంతో విసుగుచెందిన ఓ న్యూస్ ఛానల్ రిపోర్టర్.. "వెటరన్స్ ఛాయిస్ ప్రోగ్రామ్‌ మీరే తీసుకొచ్చారని ఎందుకు నిరంతరం చెప్తారు? ఇది 2014 లోనే ఆమోదించారు కదా"  అని ప్రశ్నించింది. దాంతో రిపోర్టర్ వైపు కోపంగా చూసిన ట్రంప్.. వెనక్కి తిరిగి వెళ్లిపోతూ " సరే, చాలా ధన్యవాదాలు" అంటూ విలేకరుల సమావేశం మధ్య నుంచె వెళ్లిపోయారు. 


logo