శనివారం 11 జూలై 2020
International - Jun 26, 2020 , 09:40:00

క‌రోనా నియంత్ర‌ణ‌లో అమెరికా విఫ‌లం: బిల్ గేట్స్‌

క‌రోనా నియంత్ర‌ణ‌లో అమెరికా విఫ‌లం: బిల్ గేట్స్‌

హైద‌రాబాద్: క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం అమెరికా ఎటువంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేద‌ని మైక్రోసాఫ్ట్ ఓన‌ర్ బిల్ గేట్స్ తెలిపారు.  ప్రస్తుతం ఆ దేశంలో మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య‌ను గ‌మ‌నిస్తే, మ‌హ‌మ్మారిపై పోరులో అమెరికా విఫ‌ల‌మైన‌ట్లు గేట్స్ అన్నారు.  ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌స్‌ను నియంత్రించ‌డంలో అమెరికా నాయ‌క‌త్వం ప‌ట్ల కూడా ఆయ‌న అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. అమెరికా వైఖ‌రి వ‌ల్లే భార‌త్, బ్రెజిల్ లాంటి దేశాల్లో వైర‌స్  జోరందుకున్న‌ట్లు ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. అమెరికాతో పాటు ఇత‌ర దేశాల్లోనూ క‌రోనా వైర‌స్ ప‌రిస్థితి అధ్వాన్నంగా ఉన్న‌ట్లు గేట్స్ తెలిపారు.  ఇది తాను ఊహించిక దాని క‌న్నా దారుణంగా ఉంద‌న్నారు.  

క‌రోనాను ఎదుర్కొనే క్ర‌మంలో ప‌రీక్ష‌ల‌ను మ‌రింత వేగ‌వంతం చేయాల‌న్నారు. చాలా వ‌ర‌కు దేశాలు  ఈ విష‌యంలో ముందున్నాయ‌న్నారు. మెరుగ‌వుతున్న టెక్నాల‌జీ కూడా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ద‌న్నారు.  ప్ర‌పంచ‌దేశాల‌కు నాయ‌క‌త్వం వ‌హించ‌డంలో అమెరికా విఫ‌ల‌మైన‌ట్లు చెప్పారు.  అమెరికాలో టెస్టింగ్ స‌రిగా జ‌ర‌గ‌డం లేద‌న్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా లేద‌న్నారు.  మాస్క్‌లు ధ‌రించ‌డం కూడా చాలా కీల‌మైంద‌ని గేట్స్ తెలిపారు.  ఇత‌ర దేశాలు ఇవ‌న్నీ పాటించ‌డం వ‌ల్లే.. మ‌ర‌ణాల సంఖ్య‌ను త‌గ్గించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. 

అమెరికాలో కొంద‌రు అతిజాగ్ర‌త్త‌గా, కొంద‌రు ప‌ట్టించుకోన్న‌ట్లుగా ఉంటున్నార‌న్నారు.  కొంద‌రు ఈ విష‌యాన్ని రాజ‌కీయ‌మైంద‌ని భావించ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు.  టెస్టింగ్ పెర‌గ‌డం వ‌ల్ల కేసులు పెరుగుతున్న‌ట్లు శ్వేత‌సౌధం వెల్ల‌డించ‌డాన్ని గేట్స్ త‌ప్పుప‌ట్టారు. ఈ ఏడాది చివ‌రిలోగా లేదా వ‌చ్చే ఏడాది ఆరంభంలోగా క‌రోనా వ్యాక్సిన్ వ‌స్తుంద‌న్నారు. logo