గురువారం 09 జూలై 2020
International - Jul 01, 2020 , 10:09:08

నిర్ల‌క్ష్యం వీడ‌క‌పోతే అమెరికాలో రోజూ ల‌క్ష కేసులు!

నిర్ల‌క్ష్యం వీడ‌క‌పోతే అమెరికాలో రోజూ ల‌క్ష కేసులు!

న్యూఢిల్లీ: కరోనా మ‌హ‌మ్మారి అగ్ర‌రాజ్యం అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. ఇప్ప‌టికే ఆ దేశంలో 26.28 ల‌క్ష‌లకుపైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 1.27 ల‌క్ష‌ల మందికిపైగా అమెరిక‌న్లు క‌రోనా బారిన‌ప‌డి ప్రాణాలు కోల్పోయారు. ఈ నేప‌థ్యంలో క‌రోనావైర‌స్ టాస్క్‌ఫోర్స్ స‌భ్యుడు డాక్ట‌ర్ ఆంథోనీ ఫౌసీ అమెరికాకు తీవ్ర హెచ్చ‌రిక చేశారు. దేశంలో భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైతే రానున్న రోజుల్లో రోజుకు లక్ష కొత్త కేసులు నమోదయ్యే ప్ర‌మాదం ఉంద‌ని చెప్పారు. 

అమెరికాలో క‌రోనా వైరస్ నియంత్రణ, నివారణ చర్యలపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన ఆయ‌న అత్య‌‌వ‌స‌ర చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఫౌసీ సూచించారు. క‌రోనా వైర‌స్ ప్రమాదకరమైన పెరుగుదలను నివారించడం కోసం తక్షణమే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంద‌న్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి నిర్మూల‌న‌కు ప్ర‌జ‌లు, అధికారులు ఎవ‌రికి వారే జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోకపోతే ప్రస్తుతం రోజుకు 40 వేల చొప్పున న‌మోద‌వుతున్న  కేసులు ఇక‌పై ల‌క్ష‌ల‌కు చేరినా ఆశ్చ‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ఫౌసీ వ్యాఖ్యానించారు. 

క‌రోనా మహమ్మారిపై  సమీక్ష సందర్భంగా సెనేట్ హెల్త్, ఎడ్యుకేషన్, లేబర్ అండ్ పెన్షన్స్ కమిటీలో ప్రసంగిస్తూ ఆంథోనీ ఫౌసీ ఈ హెచ్చరిక చేశారు. ప్ర‌తి ఒక్క‌రు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం నిబంధలను కచ్చితంగా పాటించాల‌ని సూచించారు. మహమ్మారి అదుపు చేయ‌డంలో అమెరిక‌న్లు అనుస‌రిస్తున్న విధానం స‌రిగా లేద‌ని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

కొత్త కేసులు వేగంగా పెరుగుతున్న తరుణంలో మ‌హ‌మ్మారి నిర్మూల‌న‌కు క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన అవసరం ఉందని ఫౌసీ నొక్కి చెప్పారు. క‌రోనా క‌ట్టిడిలో వ్యక్తులుగా, ప్రభుత్వాలుగా ఎవ‌రికివారే బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తే త‌ప్ప స‌మ‌స్య ప‌రిష్కారం ఉండ‌ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ముఖ్యంగా ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు మాస్క్ లు ధరించకపోవడం, సామాజిక దూరం పాటించ‌క‌పోవ‌డం వంటివి చేస్తే చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అమెరికా ప్ర‌జ‌ల‌ను ఫౌసీ హెచ్చ‌రించారు. 

దేశంలో క‌రోనా ఇంత తీవ్రంగా ఉన్నా చాలా మంది అమెరిక‌న్లు ఒకేచోట పెద్ద సంఖ్యలో గుంపులు కూడుతున్నార‌ని, ముఖాల‌కు మాస్కులు ధరించడం లేదని ఫౌసీ ఆరోపించారు. లాక్ డౌన్  మార్గదర్శకాలపై అమెరికన్లు సరైన శ్రద్ధ చూపడం లేదని విమ‌ర్శించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. 


logo