గురువారం 28 మే 2020
International - May 07, 2020 , 02:38:05

మరణాలు పెరిగినా..

మరణాలు పెరిగినా..

  • మార్కెట్లు తెరుచుకోవాల్సిందేఅమెరికన్లు పోరాటయోధులని అభివర్ణించిన ట్రంప్‌ 

ఫీనిక్స్‌: కరోనా వల్ల మరింతమంది అనారోగ్యం పాలైనా, మరిన్ని మరణాలు సంభవించినా అమెరికా ఆర్థిక వ్యవస్థ తెరుచుకోవాల్సిందేనని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. అమెరికన్లను పోరాటయోధులుగా అభివర్ణించిన ఆయన, వారు తిరిగి సాధారణ జీవితాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించిన అనంతరం తొలిసారి అధికారిక పర్యటన చేశారు. మంగళవారం అరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్‌లో మాస్కుల తయారు చేసే హనీవెల్‌ ఫ్యాక్టరీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘ఆర్థిక వ్యవస్థను తిరిగి తెరిచే క్రమంలో మరిన్ని ఇబ్బందులకు గురవుతాం. చాలా మందిపై ప్రభావం చూపుతుంది. మరిన్ని మరణాలు సంభవిస్తాయి’ అని చెప్పారు. అయినాసరే దేశం సాధారణస్థితికి చేరాల్సిందేనన్నారు. వ్యాక్సిన్‌ వచ్చినా రాకపోయినా వైరస్‌ నుంచి బయటపడతామని ధీమా వ్యక్తం చేశారు. 

దమ్ముంటే ఆధారాలను చూపండి.. పాంపియోకు చైనా సవాల్‌

కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబొరేటరీ నుంచే బయటకు వచ్చిందనేందుకు దమ్ముంటే ఆధారాలు చూపాలని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియోకు చైనా సవాల్‌ విసిరింది. ఈ అంశాన్ని రాజకీయ నేతలకు బదులు శాస్త్రవేత్తలు డీల్‌ చేస్తే బాగుంటుందని స్పష్టంచేసింది. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో లబ్ధికోసమే వారు ఈ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది. 



logo