మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Jul 26, 2020 , 02:59:39

ఆన్‌లైన్‌ బోధనైతే నో ఎంట్రీ

ఆన్‌లైన్‌ బోధనైతే నో ఎంట్రీ

  • ఆన్‌లైన్‌ క్లాసుల కోసం వచ్చే విద్యార్థులను దేశంలోకి అనుమతించబోం 
  • విదేశీ విద్యార్థులకు ట్రంప్‌ సర్కార్‌ మరో షాక్‌

వాషింగ్టన్‌, జూలై 25: వలస నిబంధనలను కఠినతరం చేస్తున్న ట్రంప్‌ సర్కారు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. పూర్తిగా ఆన్‌లైన్‌ మాధ్యమంలో మాత్రమే బోధనను కోరుకునే విదేశీ విద్యార్థులను ఇకపై దేశంలోకి అనుమతించేది లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో విశ్వవిద్యాలయాలు పూర్తిగా ఆన్‌లైన్‌ మాధ్యమంలో తరగతులు నిర్వహిస్తే విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందంటూ ట్రంప్‌ సర్కారు ఇటీవల వివాదస్పద ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలైన హార్వర్డ్‌, ఎంఐటీ సహా దాదాపు 200 విద్యాసంస్థలు దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేశాయి. సాంకేతిక దిగ్గజ కంపెనీలు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ కూడా వీటికి మద్దతుగా నిలిచాయి. అన్ని వైపుల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో ప్రభుత్వం ఎట్టకేలకు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నది. అయితే తాజాగా ఆన్‌లైన్‌ బోధనను ఎంచుకునే విదేశీ విద్యార్థులకు తమ దేశంలోకి అనుమతి ఇవ్వబోమని ప్రకటించడం గమనార్హం. విద్యాసంస్థలను ఎలాగైనా తిరిగి తెరిపించాలన్న కారణంతోనే ట్రంప్‌ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న ట్రంప్‌.. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేందుకు విద్యాసంస్థలు భౌతిక తరగతులు నిర్వహించేలా ఒత్తిడి తెస్తున్నారు. ఏవిధంగా స్కూళ్లు తెరువాలన్న అంశాన్ని ప్రభుత్వం రాష్ర్టాలకే వదిలిపెట్టింది. కాగా, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషన్‌ ఎడ్యుకేషన్‌ గణాంకాల ప్రకారం.. 2018-19లో అమెరికాలో 10 లక్షలకుపైగా విదేశీ విద్యార్థులు ఉన్నారు. వీరు చెల్లించే ఫీజులపై అత్యధిక విద్యాసంస్థలు ఆధారపడి ఉన్నాయి.

ట్రంప్‌ సర్కార్‌పై భారతీయ మహిళ దావా

వర్క్‌ పర్మిట్‌ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగంపై భారత్‌కు చెందిన రంజిత సుబ్రహ్మణ్య అనే మహిళ ఓహియో ఫెడరల్‌ కోర్టులో దావా వేశారు. అధికారుల ముందు కనీసం 75 వేల ఉద్యోగ అనుమతి పత్రాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఆమె భర్త వినోద్‌ సిన్హా హెచ్‌1బీ వీసాపై పనిచేస్తున్నారు. ఆమెకు హెచ్‌-4 వీసా ఉన్నది. తన వీసా పొడిగింపు, ఉద్యోగ అనుమతి పత్రానికి ఏప్రిల్‌ 7న అనుమతి లభించినప్పటికీ, ఇప్పటికి కూడా వర్క్‌ ఆథరైజేషన్‌ కార్డు తనకు అందలేదని ఆమె కోర్టుకు తెలిపారు. ఫలితంగా తాను ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. 


logo