శనివారం 30 మే 2020
International - May 16, 2020 , 09:34:50

3 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఉద్దీప‌న‌ బిల్లుకు ఆమోదం

3 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఉద్దీప‌న‌ బిల్లుకు ఆమోదం

హైద‌రాబాద్‌: అమెరికాకు చెందిన ప్ర‌తినిధుల సభ‌లో 3 ట్రిలియ‌న్ డాల‌ర్ల ప్యాకేజీ బిల్లుకు ఆమోదం ద‌క్కింది. క‌రోనా వైర‌స్ వ‌ల్ల దెబ్బ‌తిన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు భారీ ప్యాకేజీని ప్ర‌క‌టించారు. బిల్లుకు అనుకూలంగా 208 మంది, వ్య‌తిరేకంగా 199 మంది ఓటేశారు. డెమోక్రాట్లు ప్ర‌తిపాదించిన ఈ బిల్లుకు ఈజీగానే ఆమోదం ద‌క్కింది. దీంట్లో 14 మంది డెమోక్రాట్లు వ్య‌తిరేకంగా ఓటేశారు.  రాష్ట్రాల‌కు, స్థానిక ప్ర‌భుత్వాల‌కు నిధులు స‌మ‌కూర్చుకునేందుకు,  క‌రోనా వైర‌స్ టెస్టింగ్ కోసం, నిరుద్యోగుల‌కు నేరుగా డ‌బ్బ‌లు జ‌మ చేసేందుకు ఈ ప్యాకేజీ కావాల‌ని డెమోక్రాట్లు ప్ర‌తిపాదించారు. బిల్లును పాస్ చేసేందుకు స్పీక‌ర్ నాన్సీ పెలోసీ తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. కానీ  రిప‌బ్లిక‌న్లు మాత్రం బిల్లును వ్య‌తిరేకిస్తున్నారు. డెమోక్రాట్ల కోరిక‌ల చిట్టాగా ఉన్న‌ట్లు రిప‌బ్లిక‌న్లు ఆరోపిస్తున్నారు. అయితే మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో రిమోట్ ఓటింగ్‌కు కూడా అవ‌కాశం క‌ల్పించారు. ఇది చ‌రిత్రాత్మ‌కమైన మార్పు అని అంటున్నారు. వైర‌స్ వ‌ల్ల ప్ర‌యాణం చేయ‌లేక‌పోతున్న ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ ఓటును వినియోగించుకునేందుకు రిమోట్ ఓటింగ్ విధానాన్ని అమ‌లు చేయ‌నున్నారు.  ఎవ‌రి చేత‌నైనా త‌మ ఓటును స్పీక‌ర్‌కు చేర‌వేసేలా చేయ‌డ‌మే రిమోట్ ఓటింగ్‌. ఒక వ్య‌క్తి ప‌ది మంది ప్ర‌జాప్రతినిధుల ఓటు లేఖ‌ల‌ను స్పీక‌ర్‌కు అందించే అవ‌కాశం ఉంటుంది.


logo