శనివారం 28 మార్చి 2020
International - Feb 08, 2020 , 02:03:55

అల్‌ఖైదా కీలక నేత రిమీ హతం

అల్‌ఖైదా కీలక నేత రిమీ హతం
  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడి

వాషింగ్టన్‌: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాకు చెందిన మరో ఉగ్రవాదిని అమెరికా సేనలు మట్టుబెట్టాయి. అల్‌ఖైదా అరేబియన్‌ ద్వీపకల్పం (ఏక్యూఏపీ) వ్యవస్థాపకుడు ఖాసిం అల్‌ రిమీని యెమెన్‌లో తమ భద్రతా బలగాలు హతమార్చాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురువారం శ్వేతసౌధం నుంచి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా నౌకాదళ స్థావరంపై అల్‌ఖైదా జిహాదీలు సామూహిక దాడి చేసిన కొన్ని రోజులకే ఖాసిం అల్‌ రిమీని అంతమొందించడం గమనార్హం. ఫ్లోరిడాలోని పెన్‌సాకోలాలోని అమెరికా నావల్‌ ఎయిర్‌ స్టేషన్‌పై గతేడాది డిసెంబర్‌ 6న తామే దాడి చేశామని ఏక్యూఏపీ ప్రకటించుకున్నది. ఈ దాడిలో సౌదీ అరేబియా వైమానిక దళ అధికారి, ముగ్గురు అమెరికా నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఏక్యూఏపీని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర జిహాదీ నెట్‌వర్క్‌గా అమెరికా ప్రకటించింది. రిమీ మృతితో ఏపీఏక్యూ, అంతర్జాతీయంగా అల్‌ఖైదా మరింత బలహీన పడుతాయని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. 


‘రిమీ నాయకత్వంలో యెమెన్‌ వాసులకు వ్యతిరేకంగా ఏపీఏక్యూ హింసాత్మక దాడులను కొనసాగిస్తున్నది. అమెరికాకు, అమెరికా సేనలకు వ్యతిరేకంగా దాడులు చేయాలని పిలుపునిస్తున్నది. మా జాతీయ భద్రతకు ఈ ఉగ్రవాద గ్రూపు లు ముప్పుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో ఈ గ్రూపులను తొలిగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి‘ అని ట్రంప్‌ పేర్కొన్నా రు. అయితే, రిమీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా మరణించాడన్న సంగతిని ట్రంప్‌ వెల్లడించలేదు. అమెరికా వాయుసేన ఆధ్వర్యంలో జరిపిన డ్రోన్‌ దాడుల్లో రిమీ మరణించి ఉంటాడని అనధికారిక వార్తలను బట్టి తెలుస్తున్నది. అల్‌ఖైదా అధిపతి అయ్‌మన్‌ అల్‌ జవహారీ తర్వాత స్థానంలో ఉన్న రిమీపై అమెరికా ప్రభుత్వం కోటి డాలర్ల రివార్డు ప్రకటించింది. 1990వ దశకంలో అల్‌ఖైదాలో చేరిన రిమీ ఆఫ్ఘనిస్థాన్‌లో అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసా మా బిన్‌ లాడెన్‌తో కలిసి పని చేశాడు. 
logo