శనివారం 30 మే 2020
International - Apr 04, 2020 , 02:19:18

అమెరికా.. అష్టకష్టాలు

అమెరికా.. అష్టకష్టాలు

-అగ్రరాజ్యాన్ని కమ్మేసిన కరోనా

-6,500 మందికిపైగా మృత్యువాత

-2.5 లక్షలకుపైగా బాధితులు

-85% మంది ఇండ్లకే పరిమితం

-తీవ్రస్థాయికి చేరుకున్న నిరుద్యోగం

-రెండువారాల్లో కోటి ఉద్యోగాలు ఉఫ్‌

కరోనా కోరల్లో చిక్కి అగ్రరాజ్యం అతలాకుతలమవుతున్నది. ఇప్పటివరకు అమెరికాలో 2.50 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదుకాగా, 6,500 మందికిపైగా మృత్యువాతపడ్డారు. గత 24 గంటల్లోనే 1,100 మంది ప్రాణాలు కోల్పోవడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నది. వచ్చే రెండువారాలు పరిస్థితులు మరింత విషమించనున్నాయన్న వార్తల నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దేశంలో దాదాపు 85 శాతం మంది ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. కరోనాతో అమెరికాలో దాదాపు లక్ష నుంచి రెండున్నర లక్షమంది బలికానున్నారని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉన్నవాటికి తోడు రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండడంతో వైద్య సిబ్బంది సతమతమవుతున్నారు. మృతదేహాలను భద్రపరిచేందుకుం లక్ష సంచులు కావాలని అమెరికా విపత్తు ప్రతిస్పందన సంస్థ ‘ఫెమా’ అక్కడి సైన్యాన్ని కోరడం గమనార్హం. మరోవైపు, నిరుద్యోగం కూడా తారాస్థాయికి చేరుకున్నది. రెండువారాల్లో దాదాపు కోటిమంది అమెరికన్లు నిరుద్యోగులుగా మారారు. ఆంక్షల నేపథ్యంలో రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్నింటిని తెరిచినా, ‘టేక్‌ అవే’కు మాత్రమే అనుమతిస్తుండటంతో వాటి ముందు భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. 

న్యూయార్క్‌: అగ్రరాజ్యాన్ని కరోనా కమ్మేసింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా బాధితుల్లో పావువంతు అమెరికా ప్రజలేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పరిస్థితులు మరింత క్షీణిస్తాయన్న అంచనాలు అక్కడి ప్రజలను కలవరపెడుతున్నాయి. కరోనా ఆంక్షల నేపథ్యంలో రెస్టారెంట్లు, హోటళ్లు, దుకాణాలు మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని హోటళ్లు తెరిచినా, డెలివరీకి మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో వాటి ముందు భారీ ‘క్యూ’లు దర్శనమిస్తున్నాయి. మరోవైపు, నిత్యావసర సరుకులకు కొరత ఏర్పడింది. చైనా ఉత్పత్తులపైనే అమెరికా ఎక్కువగా ఆధారపడుతున్నది. ఆంక్షల నేపథ్యంలో సరుకు రవాణా నిలిచిపోవడంతో తీవ్రత మరింత పెరిగింది. ఇక లాక్‌డౌన్‌ ప్రకటిస్తే ప్రజలు తుపాకులు చేతబట్టి దుకాణాలపై పడుతారనే ఆందోళన వ్యక్తమవుతున్నది. కాగా, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు రెండోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లోనూ  నెగెటివ్‌ ఫలితం వచ్చిందని ఆయన వ్యక్తిగత వైద్యుడు తెలిపారు.

పెరుగుతున్న నిరుద్యోగం

కరోనా కారణంగా అమెరికాలో నిరుద్యోగం భారీగా పెరుగుతున్నది. రెండువారాల్లోనే దాదాపు కోటిమంది నిరుద్యోగులుగా మారారు. గత వారం సుమారు 66.5 లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు.  ప్రవాస భారతీయుల ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడ్డాయి. 

వైద్య సంక్షోభం..

రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తుండటంతో వైద్య సిబ్బంది సతమతమవుతున్నారు. మాస్క్‌లు, వెంటిలేటర్లు ఇతర వైద్య సామగ్రికి  తీవ్ర కొరత నెలకొన్నది. తమ వద్ద ఆరురోజులకు సరిపడా వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయని న్యూయార్క్‌ మేయర్‌ ఆండ్రూ క్యూమో ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తగినన్ని వెంటిలేటర్లు అందుబాటులోకి రాకపోతే మరణాలు భారీగా పెరుగుతాయని వ్యాఖ్యానించారు. మరోవైపు, వచ్చే రెండు రోజుల్లో మాస్క్‌లు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. న్యూయార్క్‌లో ఇప్పటికే పరిస్థితి దయనీయంగా ఉన్నది. టెక్సాస్‌లోనూ ఈ నెల మధ్యనాటికి పరిస్థితులు తీవ్రస్థాయికి చేరుకుంటాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. శీతాకాలం మొదలైతే వైరస్‌ వ్యాప్తి మరింత తీవ్రంగా ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.

వారే కొంపముంచారా?

సాంకేతికత, సదుపాయాలపరంగా అగ్రపథాన ఉన్న అమెరికా, ఇటలీలో పరిస్థితులు ఇంతలా దిగజారడానికి.. ఆ దేశాల్లో నివసిస్తున్న చైనీయులు నూతన ఏడాది వేడుకలకు స్వదేశానికి వెళ్లిరావడమే కారణమని ఎన్నారైలు భావిస్తున్నారు. వారి ద్వారా స్థానికులకు వైరస్‌ వ్యాపించిందని అంచనావేస్తున్నారు. 

నైతిక మద్దతులే కారణం కావడం బాధాకరం

చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్‌పై అవగాహన తెచ్చుకునేలోగానే.. అమెరికా, ఇటలీల్లో అది మరణమృదంగం మోగించింది. తొలుత చైనాలో పరిస్థితిపై ప్రపంచానికి తెలియకపోవడంతో.. అమెరికా, ఇటలీ నుంచి నూతన సంవత్సర వేడుకులకు స్వదేశానికి వెళ్లిన చైనీయులకు వైరస్‌ సోకింది. అక్కడ ఉత్సవాలు ముగించుకుని వచ్చిన చైనీయులతో స్థానిక ప్రజలకు సోకడం మొదలైంది. అలాగే మానవతా దృక్పథంలో నైతిక మద్దతుగా చేపట్టిన హగ్‌ ఎ చైనీస్‌ విధానం ఇటలీని తీవ్ర ప్రమాదంలోకి నెట్టింది. ఉత్సవాలు చేసుకోవడం.. నైతికంగా బాసటగా నిలువడమే న్యూయార్క్‌, న్యూజెర్సీలతోపాటు ఇటలీలో కరోనా పెరుగడానికి కారణం కావడం బాధాకరం.

- మహేశ్‌ బిగాల, టీఆర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్‌

  • పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాం. అమెరికాలో ఇంతవరకెన్నడూ ఇలాంటి విపత్తు చూడలేదు. ఈ పరిస్థితి భారత్‌లో ఉంటే అల్లకల్లోలమే.. అగ్రరాజ్యంలో కరోనా కల్లోలంపై కాలిఫోర్నియాలో ఉంటున్న ఒక తెలుగు వ్యక్తి చేసిన వ్యాఖ్యలివి. 
  • ‘రోజురోజుకూ పరిస్థితులు దిగజారుతున్నాయి. తలుపు తెరవాలంటేనే భయమేస్తున్నది. చేతుల్లో డబ్బులు ఉన్నా బయటకు వెళ్లి కొనలేని పరిస్థితి. షాపుల వద్ద క్యూలు తిరుమల క్యూలను తలపిస్తున్నాయి’ అని మరొకరు వ్యాఖ్యానించారు. 
  • ఫిలడెల్ఫియాకు చెందిన ఇంకొకరు మాట్లాడుతూ.. ఆరువారాలుగా ఇంట్లోనే ఉంటున్నట్లు చెప్పారు. 


logo