బుధవారం 03 జూన్ 2020
International - May 03, 2020 , 02:15:52

ప్రొఫెసర్‌ నోరునొక్కిన చైనా

ప్రొఫెసర్‌ నోరునొక్కిన చైనా

  • కరోనా జన్యుసమాచారాన్ని అందించిన మరుసటి రోజే ఆయన ల్యాబ్‌ మూసివేత
  • అమెరికా ఆరోపణ..డ్రాగన్‌ దేశంపై విమర్శలు
  • చైనాపక్షం వహిస్తున్నదని డబ్ల్యూహెచ్‌వోపై ధ్వజం

వాషింగ్టన్‌, మే 2: కరోనా జన్యు సమాచారాన్ని షాంఘై ప్రొఫెసర్‌ ఒకరు వెల్లడించారని, అయితే ఆ మరుసటి రోజే ఆయన ల్యాబ్‌ను చైనా మూసివేసిందని అమెరికా వెల్లడించింది. కరోనా ప్రబలిన తర్వాత ‘పరిస్థితిని నియంత్రించడంలో’ చైనా ఘోరంగా విఫలమైందని విమర్శించింది. అయితే ఆ దేశంపై తీసుకోబోయే చర్యలను మాత్రం వెల్లడించలేదు. కరోనా వ్యాప్తికి చైనానే కారణమని అమెరికాతో పాటు జర్మనీ, బ్రిటన్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలు నిందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాపై ప్రతీకారంగా సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురువారం సంకేతాలిచ్చారు. దీంతో శుక్రవారం మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ‘చైనాపై సుంకాలు విధించే అంశాన్ని నిజంగానే పరిశీలిస్తున్నారా లేక అధ్యక్షుడు గురువారం ఊరకనే చెప్పారా?’ అని విలేకర్లు శుక్రవారం శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కేలీ మెక్‌ఎనానీ ప్రశ్నించారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘అధ్యక్షుడిని దాటి నేను ఎలాంటి ప్రకటనలు చేయదలచుకోలేదు. కానీ చైనా పట్ల అధ్యక్షుడు అసంతృప్తితో ఉన్నారని మాత్రం చెప్పగలను. పరిస్థితిని అదుపుచేయడంలో చైనా విఫలమైందనడంలో ఎలాంటి రహస్యం లేదు. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్తా. షాంఘై ప్రొఫెసర్‌ వెల్లడించేంతవరకు వైరస్‌ జన్యుక్రమాన్ని చైనా బయటపెట్టలేదు. సమాచారాన్ని వెల్లడించిన మరుసటి రోజే ఆ ప్రొఫెసర్‌ ల్యాబ్‌ను చైనా మూసివేసింది. అలాగే మనుషుల నుంచి మనుషులకు వైరస్‌ వ్యాప్తిపైనా సరైన సమయంలో వివరాలు అందించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా అలాగే వ్యవహరించింది. అమెరికా దర్యాప్తు బృందాన్ని చైనాలోకి అనుమతించేందుకు కూడా నిరాకరించారు’ అని ఆమె వివరించారు.

చైనా తప్పుడు సమాచారం..

వైరస్‌కు సంబంధించి చైనా తమకు అవాస్తవ సమాచారాన్ని అందిస్తున్నదని మెక్‌ఎనానీ అన్నారు. ప్రస్తుత సంకేతాలను బట్టి అధ్యక్షుడు చెప్పినట్లు వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వైరస్‌ బయటకు వచ్చినట్లు చాలా మంది నిపుణులు భావిస్తున్నారని చెప్పారు. అయితే వైరస్‌ మానవ సృష్టికాదని, జన్యుపరంగా మార్పిడి కూడా చేయలేదని అమెరికా నిఘా సంస్థలు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు మెక్‌ఎనానీ సమాధానమిస్తూ.. ‘నిఘా అనేది కేవలం ముఖ్యమైన అంచనా. దానిపై ఏం చేయాలన్నది దేశాధ్యక్షుడు నిర్ణయిస్తారు’ అని చెప్పారు.

పక్షపాతంతో వ్యవహరిస్తున్న డబ్ల్యూహెచ్‌వో

డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా ఏటా 400-500 మిలియన్‌ డాలర్లు అందించగా, చైనా కేవలం 40 మిలియన్‌ డాలర్లు మాత్రమే అందించిందని మెక్‌ఎనానీ పేర్కొన్నారు. అయినప్పటికీ, డబ్ల్యూహెచ్‌ఓ చైనా పక్షం వహిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. మనుషుల నుంచి మనుషులకు వైరస్‌వ్యాప్తిపై డిసెంబర్‌ 31న తైవాన్‌ అధికారులు హెచ్చరించినా డబ్ల్యూహెచ్‌వో దాన్ని బహిరంగపరుచలేదని విమర్శించారు. 


అస్సలు అబద్ధం చెప్పను

  • వైట్‌హౌస్‌ కొత్త ప్రెస్‌ సెక్రటరీ ఉద్ఘాటన

తాను ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పనని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ కేలీ మెక్‌ఎనానీ చెప్పారు. ప్రెస్‌ సెక్రటరీ హోదాలో శుక్రవారం ఆమె తొలిసారి విలేకరులతో మాట్లాడారు. ‘అధ్యక్షుడు ట్రంప్‌ ఆలోచన విధానాలను మీకు చేరవేయడం, వాస్తవ పరిస్థితులను అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లడం నా లక్ష్యం. తద్వారా వాస్తవాలు ఇటు అధ్యక్షుడు ట్రంప్‌నకు, అటు అమెరికా ప్రజలకు స్పష్టంగా తెలుస్తాయి’ అని ఆమె తెలిపారు. 


logo