ఆదివారం 29 నవంబర్ 2020
International - Oct 22, 2020 , 15:34:29

విమానంలో మరణించిన కరోనా రోగి

విమానంలో మరణించిన కరోనా రోగి

వాషింగ్టన్‌: కరోనా బారిన పడిన ఒక మహిళ విమానంలో ప్రయాణిస్తూ మరణించింది. అమెరికాలో కొన్ని రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టెక్సాస్‌కు చెందిన ఒక మహిళ (38) జూలై 24 సాయంత్రం లాస్ వెగాస్ నుండి డల్లాస్‌లోని ఇంటికి వెళ్లేందుకు స్పిరిట్ ఎయిర్లైన్స్ విమానంలో బయలుదేరింది. ఆ విమానం టేకాఫ్‌ అయిన కొంతసేపటికి ఆమె అచేతనంగా ఉండటాన్ని విమాన సిబ్బంది గమనించారు. ఆమెకు సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో అత్యవసర వైద్య సేవల కోసం విమానాన్ని డల్లాస్‌కు బదులు అల్బుకెర్కీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. అక్కడ విమానం కిందకు దిగగానే ఎమర్జెన్సీ వైద్య సిబ్బంది ఆమెను పరిశీలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు నిర్ధారించారు. వైద్య పరీక్షల్లో ఆమెకు కరోనా సోకినట్లు తేల్చారు. ఉబకాయంతోపాటు ఉబ్బసం వంటి సమస్యలతో బాధపడుతున్న ఆ మహిళకు కరోనా వైరస్‌ సోకడంతో చనిపోయినట్లు ధృవీకరించారు.

కాగా, కరోనా సోకిన సంగతి ఆమెకు తెలియకపోవచ్చని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు ఆమె మరణంపై ఆ విమానయాన సంస్థ సంతాపం వ్యక్తం చేసింది. కరోనా మార్గదర్శకాలను పాటించడంతోపాటు నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 83.8 లక్షలు దాటగా ఇప్పటి వరకు 2.22 లక్షల మంది మరణించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.