వాషింగ్టన్: అమెరికా క్యాపిటల్ హిల్‌లోని కాంగ్రెస్ గ్రంథాలయం భవనం బయట బాంబులతో కూడిన ఒక వాహనం ఉండటం కలకలం రేపింది. దీంతో క్యాపిటల్ హిల్ పోలీసులు ఆ భవనాన్ని ఖాళీ చేయించారు. చట్టసభ్యులు, ఇతర సిబ్బంది, ప్రజలను అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలని సూచించారు. పరిస్థితిని గమనిస్తున్నామని ట్వీట్ చేశారు. కాగా, ఆ ప్రాంతాన్ని పోలీసులు మూసి వేశారు. మరోవైపు వాహనంలో ఉన్నవి పేలుడు పదార్థాలేనా, అందులో ఉన్న వ్యక్తి వద్ద డిటోనేటర్ ఉన్నదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో క్యాపిటల్ హిల్ పోలీసులతోపాటు ఎఫ్‌బీఐ, ఆల్కహాల్, పొగాకు, తుపాకులు, పేలుడు పదార్థాల బ్యూరోలకు చెందిన సిబ్బంది కూడా అక్కడకు చేరుకున్నారు.