లండన్: ఒక్కొక్కటి 117 మీటర్ల ఎత్తున్న భారీ కూలింగ్ టవర్. అలాంటివి నాలుగు టవర్లు ఒకేసారి కుప్పకూలితే ఎలా ఉంటుంది. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో అదే జరిగింది. ఇంగ్లండ్‌లోని స్టాఫర్డ్షైర్లో ఉన్న రూగ్లీ పవర్ స్టేషన్‌కు చెందిన ఈ ఐదు దశాబ్దాల కిందటి కూలింగ్ టవర్లను అక్కడి అధికారులు ధ్వంసం చేశారు. బొగ్గు ఆధారిత పవర్ స్టేషన్‌ను 2016లోనే మూసేశారు. ఇప్పుడా ప్రదేశంలో ఇండ్లు, వ్యాపార సముదాయాలను నిర్మించనున్నారు.
ఒకేసారి ఈ నాలుగు టవర్లను పేల్చడాన్ని అన్ని యాంగిళ్లలో చూపిస్తోందీ వీడియో. క్షణాల్లోనే టవర్లు కూలిపోయి దట్టమైన దుమ్ముధూళి ఆ ప్రదేశాన్ని కమ్మేశాయి. ఈ టవర్లను పేల్చుతుంటే చూడటానికి వందల మంది స్థానికులు అక్కడికి వచ్చారు. ఒకప్పుడు 60 లక్షల గ్యాలన్ల నీటిని గంటలోనే ఈ టవర్లు చల్లార్చేవి.