బుధవారం 27 జనవరి 2021
International - Jan 08, 2021 , 01:43:22

అధ్యక్షుడు.. బైడెనే

అధ్యక్షుడు.. బైడెనే

  • అధికారికంగా ధ్రువీకరించిన అమెరికా కాంగ్రెస్‌
  • ఎన్నిక ప్రక్రియను అడ్డుకొనేందుకు ట్రంప్‌ విశ్వప్రయత్నం
  • బైడెన్‌ ఎన్నికల చెల్లదని ప్రకటించాలంటూ మైక్‌ పెన్స్‌పై ఒత్తిడి
  • తిరస్కరించిన ఉపాధ్యక్షుడు.. హింసకు తలవంచనని ప్రకటన
  • అధికారం అప్పగిస్తా.. కానీ ఫలితాలను ఒప్పుకోనని ప్రకటన
  • ఎలక్టోరల్‌ కాలేజీలో బైడెన్‌కు 306.. ట్రంప్‌కు 232 ఓట్లు

వాషింగ్టన్‌, జనవరి 7: ఉత్కంఠకు తెరపడింది. మూడు నెలలుగా ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తున్న అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల ఫలితం తేలిపోయింది. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ గెలుపొందినట్టు ఆ దేశ చట్టసభలు అధికారికంగా ప్రకటించాయి. ఈ నెల 20న బైడెన్‌ అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ కమలాహారిస్‌ కూడా అదే రోజు ప్రమాణం చేస్తారు. ఎలక్టోరల్‌ కాలేజీ సమావేశంలో బైడెన్‌ను 306 ఓట్లు రాగా.. ట్రంప్‌కు 232 ఓట్లు మాత్రమే వచ్చాయి. 

బైడెన్‌ గెలుపును అడ్డుకో పెన్స్‌.. 

అధికారాన్ని నిలుపుకొనేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ ఆఖరిక్షణం వరకూ విశ్వ ప్రయత్నాలు చేశారు. రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్‌ (ప్రతినిధుల సభ, సెనేట్‌) సమావేశానికి ఉపాధ్యక్షుడు అధ్యక్షత వహిస్తారు. దాంతో ఎలక్టోరల్‌ కాలేజీలో బైడెన్‌ గెలుపును అడ్డుకోవాలని మైక్‌ పెన్స్‌పై ట్రంప్‌ తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయినా పెన్స్‌ లొంగలేదు. నిజాయితీగా ఎన్నిక నిర్వహించి బైడెన్‌ గెలిచినట్టు ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్‌కు రాసిన లేఖలో ట్రంప్‌ తీరుపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కొన్ని రాష్ర్టాల ఫలితాలను పరిగణనలోకి తీసుకోరాదని కొందరు నన్ను కోరారు. ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారిగా రాజ్యాంగానుసారం వ్యవహరిస్తానని ప్రమాణం చేశాను. చట్టబద్ధంగా లభించిన ఎలక్టోరల్‌ ఓట్లను తిరస్కరించే అధికారం నాకు లేదు. హింస ఎప్పటికీ గెలువదు’ అని స్పష్టంచేశారు. పెన్స్‌ నిర్ణయంపై పార్టీలకతీతంగా ప్రశంసలు వస్తున్నాయి. 

ఒంటరైన ట్రంప్‌

కాంగ్రెస్‌పై బుధవారం ట్రంప్‌ మద్దతుదారుల దాడితో.. ఎలక్టోరల్‌ కాలేజీ ఓటింగ్‌లో రిపబ్లిక్‌ నేతలు కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. ఎన్నికల ఫలితాలపై చర్చ సందర్భంగా పెన్సిల్వేనియా, అరిజోనా రాష్ర్టాల ఫలితాలపై వచ్చిన అభ్యంతరాలను ఉభయసభలు భారీ మెజారిటీతో తిరస్కరించాయి. ఈ ఓటింగ్‌లో ట్రంప్‌ సొంతపార్టీ రిపబ్లికన్‌ నేతలు కూడా బైడెన్‌కే మద్దతుగా నిలువటం విశేషం. 

అధికారం అప్పగిస్తా: ట్రంప్‌

బైడెన్‌ను విజేతగా ప్రకటించటంతో అధ్యక్షుడు ట్రంప్‌ విధిలేని పరిస్థితుల్లో అధికార బదిలీకి అంగీకరించారు. ‘అమెరికా చరిత్రలోనేఅతిగొప్ప పాలన అందించిన అధికారానికి కాంగ్రెస్‌ నిర్ణయం ముగింపు పలికింది. ఎన్నికల ఫలితాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కానప్పటికీ.. 20వ తేదీన చట్టబద్ధంగా బైడెన్‌కు అధికారాన్ని అప్పగిస్తా. అమెరికాను మరోసారి గొప్పదేశంగా మలిచే పోరులో ఇది ప్రారంభం’ అని అన్నారు.

సెనేట్‌ కూడా డెమోక్రాట్లదే..

అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మొండితనంతో పదవి నుంచి దిగిపోతూ తన సొంతపార్టీని కూడా ముంచారు. ఇప్పటివరకు ప్రతినిధుల సభలోనే డెమోక్రాట్లకు మెజారిటీ ఉండగా.. తాజాగా సెనేట్‌ కూడా వారి వశమైంది. జార్జియాలో రెండు సెనేట్‌ స్థానాలకు మంగళవారం జరిగిన రీ ఎలక్షన్‌లలో డెమోక్రాటిక్‌ అభ్యర్థులు రాఫెల్‌ వార్నాక్‌, జాన్‌ ఓస్సాఫ్‌ ఘన విజయం సాధించారు. గత నవంబర్‌ 3న జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈ రెండు స్థానాల్లో రెండు పార్టీల అభ్యర్థుల్లో ఎవరూ విజయానికి అవసరమైన 50 శాతం ఓట్లు గెలువలేక పోవడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఉపాధ్యక్షురాలిదే ‘కీ’

తాజా ఫలితాలతో 100 స్థానాలున్న సెనేట్‌లో రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు చెరో 50 సీట్లు లభించాయి.  బిల్లుల పై ఓటింగ్‌ నిర్వహిస్తే సమాన ఓట్లు వస్తాయి. అప్పుడు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఓటు కీలకమవుతుంది. ఆమె డెమోక్రాటిక్‌ నేతే కాబట్టి బైడెన్‌ ప్రభుత్వానికి అనుకూలంగానే ఓటు వేస్తారు. రెండు సభలు తనకు అనుకూలంగా మారటంతో  బైడెన్‌కు కాంగ్రెస్‌లో సానుకూల నిర్ణయాలే వస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


logo