బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Mar 18, 2020 , 13:51:05

క‌రోనా మీదంటే మీదే.. చైనా, అమెరికా బాహాబాహీ

క‌రోనా మీదంటే మీదే.. చైనా, అమెరికా  బాహాబాహీ

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌19 లేదా సార్స్ సీఓవీ2.  ఇంత‌కీ ఈ వైర‌స్.. ఏదైనా జంతువు నుంచి పుట్టిందా లేక జీవాయుధ‌మా.  దీనిపై రెండు అగ్ర‌దేశాలు దాదాపు బాహాబాహీకి దిగుతున్నాయి.  ఇది మీ వైర‌స్ అంటే మీ వైర‌స్సే అని అమెరికా, చైనా దేశాలు రుస‌రుస‌లాడుతున్నాయి.  అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ మాత్రం ఎక్క‌డ మాట్లాడినా.. అది చైనీస్ వైర‌స్సే అంటున్నారు.  రిపోర్ట‌ర్లు అలా మాట్లాడ వ‌ద్దు అని అంటున్నా.. ఆయ‌న వినిపించుకోవ‌డం లేదు.  ఇది క‌చ్చితంగా చైనా నుంచి వ‌చ్చిన వైర‌స్సే అని ట్రంప్ గ‌ట్టిగా స్ప‌ష్టం చేస్తున్నారు.

చైనాలోని వుహాన్ న‌గ‌రం నుంచి విశ్వ‌వ్యాప్తం అయిన క‌రోనా వైర‌స్‌.. గ‌బ్బిలాల నుంచి పుట్టింద‌ని ఓ థియేరీ చెబుతోంది. కొంద‌రు శాస్త్ర‌వేత్త‌లు ఈ వైర‌స్ వ్యాప్తిలో గ‌బ్బిలాల‌ను అనుమానిస్తున్నారు. గ‌తంలో వ‌చ్చిన సార్స్‌, మెర్స్ లాంటి వైర‌స్‌లో సీఓవీ2 ఉన్నందు వ‌ల్ల‌.. ఇప్పుడు కూడా ఇది గ‌బ్బిలాల నుంచే వ్యాప్తి చెందిన‌ట్లు భావిస్తున్నారు. కానీ చైనా త‌న వాద‌ద‌ను మ‌రోలా వినిపిస్తోంది.  వుహాన్‌లో మిలిట‌రీ గేమ్స్ ఆడేందుకు వ‌చ్చిన అమెరికా సైనికుల నుంచి క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందిన‌ట్లు చైనా ఆరోపిస్తున్న‌ది.  

మ‌రోవైపు అమెరికా మాత్రం.. వుహాన్‌లో ఉన్న ఓ ల్యాబ్ నుంచి ఈ కృత్రిమ వైర‌స్ విశ్వ‌వ్యాప్త‌మైంద‌ని అంటోంది. కరోనా వైర‌స్ జంతువు నుంచి రాలేదని,  వుహాన్‌లో ఉన్న బ‌యోసేఫ్టీ లెవ‌ల్ ఫోర్ ల్యాబ‌రేట‌రీ నుంచి వైర‌స్ వ్యాప్తి చెందిన‌ట్లు అమెరికా ఆరోపిస్తున్న‌ది. ఆ ప‌రిశోధ‌న‌శాల‌లో ప‌లుర‌కాల క‌రోనా వైర‌స్‌లు ఉన్న‌ట్లు అమెరికా అనుమానిస్తున‌ది. 

గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో వుహాన్ న‌గ‌రంలో అమెరికా సైన్యం గేమ్స్ ఆడేందుకు వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో ఆ మిలిట‌రీనే ఈ వైర‌స్‌ను పుట్టించిన‌ట్లు చైనా విదేశాంగ శాఖ ప్ర‌తినిధి జావో లిజాన్ తెలిపారు.  అది చైనీస్ వైర‌స్ అంటూ ట్రంప్ ప‌దేప‌దే కామెంట్ చేయ‌డం చైనాకు ఆగ్ర‌హాన్ని తెప్పించింది.  ఈ నేప‌థ్యంలో చైనాకు చెందిన గ్జినావ్ న్యూస్‌ ఏజెన్సీ ఓ ట్వీట్ కూడా చేసింది. జాత్యంహ‌కార వ్యాఖ్య‌ల‌తో మీ అస‌మ‌ర్థ‌త‌ను క‌ప్పిపుచ్చుకోలేర‌ని ఆ సంస్థ త‌న ట్వీట్‌లో చెప్పింది.  

క‌రోనా వ్యాప్తికి చైనా కూడా స్ప‌ష్టమైన విష‌యాల‌ను చెప్ప‌లేక‌పోతున్న‌ది. గ‌బ్బిలాల లేక పంగోలిన్‌ల నుంచి ఆ వైర‌స్ వ్యాప్తి చెందిందా అన్న విష‌యాన్ని తేల్చ‌లేక‌పోయింది.  వుహాన్ ల్యాబ్ నుంచి ఉత్ప‌త్తి అయ్యిందా, లేక అమెరికా ఆర్మీ వ్యూహాత్మ‌కంగా ఆ వైర‌స్‌ను వుహాన్‌లో వ‌దిలిందా అన్న‌ది మ‌రిన్ని అనుమానాల‌కు దారితీస్తోంది.  అమెరికా సైన్య‌మే  SARS-CoV2 వైర‌స్‌ను సృష్టించిన‌ట్లు చైనీలు ఆరోపిస్తున్నారు. గ‌త కొన్నాళ్లుగా రెండు దేశాల మ‌ధ్య న‌డ‌స్తున్న ట్రేడ్ వార్ ఇప్పుడు వైర‌స్ వార్‌గా మారింది.

 SARS-CoV2 వైర‌స్‌లో ఉన్న ఆర్ఎన్ఏ.. వుహాన్ మార్కెట్లో అమ్ముతున్న జంతువుల‌కు సోకి ఉంటుంద‌ని మ‌రో స్ట‌డీ అభిప్రాయ‌ప‌డుతున్న‌ది. అయితే వైర‌స్‌లో ఉన్న స్పైక్ ప్రోటీన్లు మాత్రం ప్రాణాంత‌కంగా ఉన్న‌ట్లు గుర్తించారు. ఆ స్పైక్‌ ప్రోటీన్లు ఎంత‌టి మాన‌వ క‌ణాన్ని అయినా చీల్చి వేయ‌గ‌ల‌వు.  అయితే కృత్రిమంగా ఇలాంటి ప్రోటీన్ల‌ను త‌యారు చేయ‌డం క‌ష్ట‌మే అన్న అభిప్రాయాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి.  SARS-CoV2 వైర‌స్‌తో జీవాయుధాన్ని త‌యారు చేయ‌డం సాధ్య‌మే. కానీ, ప్ర‌స్తుతం ఆ వైర‌స్ వ‌ల్ల న‌మోదు అవుతున్న మ‌ర‌ణాల సంఖ్య త‌క్కువే ఉన్న‌ది. ఒక‌వేళ అది జీవాయుధ‌మే అనుకుంటే.. మ‌ర‌ణాల సంఖ్య ఇంకా ఎక్కువ‌గా ఉండాలి. కానీ సార్స్‌, మెర్స్ త‌ర‌హాలో ఉన్న ఆ వైర‌స్ జ‌న్యుక్ర‌మం స‌హ‌జంగా ఏర్పడిన‌ట్లు కొంద‌రు శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. 

అమెరికా, చైనా మ‌ధ్య జ‌రుగుతున్న కుట్ర సిద్ధాంతాలు ఎలా ఉన్నా.. భార‌త్ మాత్రం ఆ వైర‌స్‌ను అత్యంత ప‌క‌డ్బందీగా నియంత్రిస్తోంది.  అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు, సామూహిక కార్య‌క్ర‌మాల‌ను బంద్ చేశాయి.  ఇక ప్ర‌ధాని మోదీ కూడా సార్క్ దేశాల‌తో స‌మావేశం నిర్వ‌హించి.. వైర‌స్ క‌ట్ట‌డికి భారీ నిధిని ప్ర‌క‌టించారు.  ఈ చ‌ర్య ప్ర‌పంచ‌దేశాల‌ను ఆక‌ర్షిస్తోంది.  వైర‌స్ నియంత్ర‌ణ‌లో రాజ‌కీయ పాత్ర కీల‌కంగా మారింది. 


logo