మంగళవారం 26 జనవరి 2021
International - Jan 08, 2021 , 01:43:22

దాడులకు కన్నీటి సాక్ష్యం.. క్యాపిటల్‌

దాడులకు కన్నీటి సాక్ష్యం.. క్యాపిటల్‌

  • గతంలోనూ విషాద ఘటనలు

అమెరికా క్యాపిటల్‌ పై ‘ట్రంప్‌'రిమూకలు సాగించిన దాడులు ఆ విశిష్ట సౌధం ప్రతిష్ఠపై మాయని మచ్చను మిగిల్చాయి. రెండు శతాబ్దాలకు పైగా ఘనచరిత్ర కలిగిన క్యాపిటల్‌పై ఇలాంటి హేయమైన దాడి జరగడం ఇదే తొలిసారి. అయితే ఈ భవనంలో గతంలోనూ కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి. 

1800: అమెరికా క్యాపిటల్‌ భవనంలో కార్యకలాపాలు ప్రారంభం.

1814: అమెరికా-బ్రిటన్‌ మధ్య 1812లో యుద్ధం ప్రారంభమైంది. బ్రిటిష్‌ బలగాలు క్యాపిటల్‌లోకి చొరబడి దోపిడీకి పాల్పడ్డారు.సుప్రీంకోర్టు ఛాంబర్‌తో పాటు క్యాపిటల్‌ ఉత్తర, దక్షిణ భాగాలకు నిప్పు పెట్టారు. క్యాపిటల్‌ ప్రారంభమయ్యాక హింస చోటుచేసుకోవడం ఇదే తొలిసారి.

1835: క్యాపిటల్‌ భవనంలోని హౌస్‌ ఆఫ్‌ ఛాంబర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై బయటకు వస్తున్న మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్‌పై హత్యాయత్నం జరిగింది . బ్రిటిష్‌ వలసదారుడైన రిచర్డ్‌ లారెన్స్‌ అనే వ్యక్తి ఆండ్రూపై కాల్పులు జరిపాడు. 1915: ప్రతిష్ఠాత్మక హార్వర్డ్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన ఎరిచ్‌ మ్యు యెంటర్‌ అనే వ్యక్తి ‘క్యాపిటల్‌'లోని సెనెట్‌ రిసెప్షన్‌ గదిలో మూడు డైనమైట్‌ స్టిక్‌లను పెట్టాడు. అయితే అర్ధరాత్రి సమయంలో అవి పేలడంతో పెను ప్రమాదం తప్పింది. 1954: ప్యూర్టోరికోపై అమెరికా విధించిన ఆంక్షలను నిరసిస్తూ, తమ దేశానికి స్వాతంత్య్రం కోరుతూ ప్యూర్టోరికో  చెందిన నలుగురు వ్యక్తులు ప్రతినిధుల సభ గ్యాలరీలో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు కాంగ్రెస్‌ సభ్యులు గాయపడ్డారు. 

1998: క్యాపిటల్‌ భవనం చెక్‌పాయింట్‌ వద్ద ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు చనిపోయారు. 

2001: సెప్టెంబరు 9న న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ను విమానాలతో కూల్చేసిన అల్‌ఖైదా ఉగ్రవాదులు పెంటగాన్‌పై కూడా దాడులకు తెగబడ్డారు. క్యాపిటల్‌ భవనాన్ని కూల్చేందుకు కూడా ఒక విమానం ద్వారా సిద్ధమయ్యారు. అయితే ఆ విమానంలోని ప్రయాణికులు, క్యాబిన్‌ సిబ్బంది హైజాకర్లను అడ్డుకున్నారు.  

2013: చెక్‌పాయింట్‌ను దాటుకొని ఓ మహిళ క్యాపిటల్‌లోకి వాహనంతో దూసుకురాగా పోలీసులు కాల్చి చంపారు. 

2016: క్యాపిటల్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ అక్కడి భద్రతా అధికారులపై ఓ వ్యక్తి తుపాకీని గురి పెట్టాడు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని కాల్చి చంపారు.

2021: జో బైడెన్‌ గెలుపును పార్లమెంటు సభ్యులు ధ్రువీకరిస్తున్న సమయంలో ట్రంప్‌ మద్దతుదారుల దాడులు.


logo