సోమవారం 23 నవంబర్ 2020
International - Nov 06, 2020 , 20:53:24

యూఎస్‌, యూకే.. ప్రపంచంలోనే ‘చెత్త’ దేశాలు..:అధ్యయనం

యూఎస్‌, యూకే.. ప్రపంచంలోనే ‘చెత్త’ దేశాలు..:అధ్యయనం


హైదరాబాద్‌: ప్రపంచంలోనే ఉత్తమ నివాస దేశాలుగా పేరుగాంచిన యూఎస్‌, యూకే చెత్త నిర్వహణలో మాత్రం వెనుకబడ్డాయి. ప్రపంచంలోనే అతి ఎక్కువ ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఈ దేశం నుంచే పోగుపడుతున్నాయట. ఈ విషయాలు తాజా అధ్యయనంలో వెల్లడయ్యాయి. ఈ అధ్యయన ఫలితాలు సైన్స్‌ అడ్వాన్సెస్‌ పత్రికలో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధన ప్రకారం.. ప్రపంచంలోనే సముద్రాలను ప్లాస్టిక్‌ వ్యర్థాలతో కలుషితం చేస్తున్న దేశాల్లో యూఎస్‌, యూకే ముందువరుసలో ఉన్నాయి. యూఎస్‌ జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో 4 శాతం మాత్రమే ఉండగా, 17 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను జమచేస్తోంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలను వదులుతున్న దేశాల్లో అమెరికా ప్రపంచంలోనే మూడోస్థానంలో ఉంది. 

ఓషన్ కన్జర్వెన్సీ ట్రాష్ ఫ్రీ సీస్ ప్రోగ్రాం సీనియర్ డైరెక్టర్, అధ్యయనకర్త నిక్ మల్లోస్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యం సంక్షోభ స్థాయిలో ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. యూఎస్‌లో రీసైక్లింగ్ కోసం సేకరించిన ప్లాస్టిక్‌లో సగానికి పైగా విదేశాలకు రవాణా చేయబడినట్లు 2016 నుంచి లభించిన తాజా డేటా చూపిస్తుంది. సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఇప్పటికే ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడానికి కష్టపడుతున్న దేశాలకు పంపించారు. అంటే ఎగుమతి ముసుగులో అమెరికా.. ప్రపంచ వాతావరణానికి చేస్తున్న నష్టాన్ని కప్పి పుచ్చుకుంటోందని ఈ అధ్యయనం పేర్కొంటోంది. 

ప్లాస్టిక్ వ్యర్థాలు మొత్తం భూగ్రహాన్నే కలుషితం చేశాయి. ఇది వన్యప్రాణులకు హాని కలిగిస్తుంది. ప్రజలందరికీ నిత్యావసరాలైన నీరు, ఆహారంలో ఇప్పటికే పెద్ద మొత్తంలో మైక్రోప్లాస్టిక్స్‌ వచ్చి చేరింది. భూమిపై ఉన్న ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం సాధ్యమయ్యే అన్ని చర్యలూ తీసుకున్నా అది కేవలం 40 శాతం మాత్రమే సాధ్యమని సెప్టెంబర్‌లో నిర్వహించిన పరిశోధకులు అధ్యయనంలో తేలింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి, పునర్వినియోగం, వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ ఆలోచనను ప్రోత్సహించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి చర్య తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఈ పరిశోధన తేల్చింది.  

ప్లాస్టిక్‌ వ్యర్థాల దిగుమతిపై చైనా నిషేధం..

ప్లాస్టిక్ వ్యర్థాలను దిగుమతి చేసుకోవడాన్ని 2018 లో చైనా నిషేధించింది. మలేషియా, వియత్నాం, థాయ్‌లాండ్, ఇండియా, ఇండోనేషియా తమ సొంత ఆంక్షలతో అనుసరించాయి. 2019లో గార్డియన్ దర్యాప్తు ప్రకారం.. యూఎస్‌లోని ప్లాస్టిక్ ఇప్పుడు ప్రపంచంలోని కొన్ని పేద దేశాలకు పంపిస్తున్నారు. బంగ్లాదేశ్, లావోస్, ఇథియోపియా, సెనెగల్స్‌కు వెళ్తోంది. ఈ దేశాల్లో పర్యావరణ నియంత్రణ పరిమితం, శ్రామికులకు ఇచ్చే జీతాలు చాలా తక్కువ. అందుకే అమెరికా తన దేశంలోని ప్లాస్టిక్‌ వ్యర్థాన్ని రీసైక్లింగ్‌ పేరుతో పేద దేశాలకు పంపిస్తోంది.   

సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించిన తాజా అధ్యయనం 217 దేశాలలో వ్యర్థాల ఉత్పత్తిపై ప్రపంచ బ్యాంకు డేటాను విశ్లేషించింది. ఇది అమెరికాపై దృష్టిసారించింది. ఆ దేశంలో చెత్తాచెదారం అక్రమ డంపింగ్‌కు సంబంధించిన డేటా, ఎగుమతి చేసిన ప్లాస్టిక్ వల్ల కలిగే కాలుష్యాన్ని అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 2016లో అమెరికా 34,000 కిలోల చొప్పున అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసిందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే, అదనపు డేటాను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మొత్తం 42,000 కిలోలకు పెరిగింది. అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి కలిగిన 20 దేశాలలో, యూఎస్‌ తర్వాత యూకే ఉంది. వీటి తర్వాతి స్థానాల్లో దక్షిణ కొరియా, జర్మనీ ఉన్నాయి. 

కాగా, ఈ ప్లాస్టిక్‌ వ్యర్థాల సమస్యకు మల్లోస్ ఓ పరిష్కారం చూపారు. ప్రపంచదేశాలన్నీ సమష్టిగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు.  సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వాడకాన్ని తగ్గించాలని, అలాగే రీసైక్లింగ్ రేట్లు కూడా మెరుగుపరచాల్సిన అవసరముందని చెప్పారు. దేశాలు చెత్త నిర్వహణను ప్రారంభించకపోతే వ్యర్థాలన్నీ పల్లపు ప్రదేశాలకు వెళ్తాయని, ఇది ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని పెంచుతుందని తెలిపారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.