బుధవారం 03 జూన్ 2020
International - May 19, 2020 , 16:40:33

ట్రంప్ మాత్రల ప్రకటనపై అమెరికాలో దుమారం

ట్రంప్ మాత్రల ప్రకటనపై అమెరికాలో దుమారం

వాషింగ్టన్: కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు తాను హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు వేసుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై దుమారం రేగింది. ప్రాణాంతకమైన సైడ్ఎఫెక్ట్స్ కారణంగా ఆ మందును హాస్పిటల్ లో ఉన్నరోగులు, ప్రయోగాల్లో పాల్గొనేవారు మాత్రమే తీసుకోవాలని అమెరికా ప్రభుత్వమే చెప్పింది. ఆ ప్రభుత్వానికి అధినేతగా ఉన్న ట్రంప్ వాటిని వేసుకుంటున్నట్టు చెప్పడంపై హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ స్పందించారు. 'ఆయన మన అధ్యక్షుడు. శాస్త్రీయంగా రుజువుకాని మందులను ఆయన.. అదీ ఆ వయసులో.. అంత ఊబకాయం పెట్టుకుని వేసుకోవడం నేను అయితే ఒప్పుకోను' అని ఆమె వ్యాఖ్యానించారు. సెనేట్ డెమొక్రాటిక్ నేత చక్ షూమర్ అధ్యక్షుని ప్రకటనను ప్రమాదకరమైనదిగా అభివర్ణించారు. 'నిజంగా తీసుకుంటున్నాడో లేదో తెలియదు. ఎందుకంటే చాలా విషయాల్లో ఆయన అబద్ధాలు చెప్తారు. ఏదిఏమైనా ఆయన ప్రకటన మాత్రం బాధ్యతారాహిత్యం' అని షూమర్ అన్నారు. అమెరికాకు చెందిన పలువురు వైద్యరంగ ప్రముఖులు ట్రంప్ ప్రకటనను ఖండించారు. ప్రజలు ఆ మాత్రలు పనిచేస్తాయని నమ్మే ప్రమాదముందని అమెరికా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిస్ హారిస్ హెచ్చరించారు. అది కరోనాకు వైద్య ప్రపంచం నిర్ధారించిన మందు కానేకాదని డాక్టర్ డేవిడ్ ఆరనాఫ్ అన్నారు. చైనా కమ్యూనిస్టుపార్టీ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆయన క్షుద్రవిద్యలతో కరోనాను ఎదుర్కొంటున్నారని, ఫలితంగా 90 వేల మందికి పైగా మరణించారని దుయ్యబట్టింది. అదే చైనాలో అయితే వైట్‌హౌస్‌ను జనం ఆగ్రహంతో తగులబెట్టి ఉండేవారని పేర్కొన్నది.


logo