గురువారం 02 ఏప్రిల్ 2020
International - Feb 01, 2020 , 02:53:14

తెగిన బంధం!

తెగిన బంధం!
  • ఈయూ నుంచి అధికారికంగా వైదొలిగిన బ్రిటన్
  • సరికొత్త ఉషోదయానికి నాంది: బ్రిటన్ ప్రధాని బోరిస్

లండన్: బ్రిటన్ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియ బ్రెగ్జిట్ ఎట్టకేలకు సాకారమైంది. శుక్రవారం రాత్రి 11 గంటలకు (భారత కాలమాన ప్రకారం శనివారం వేకువజామున 4.30 గంటలకు) బ్రిటన్ అధికారికంగా ఈయూ నుంచి వైదొలిగింది. దీంతో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఈయూతో పెనవేసుకున్న రాజకీయ, ఆర్థిక, న్యాయ సంబంధాలకు తెరపడింది. 2016 జూన్‌లో నిర్వహించిన రెఫరెండంలో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ప్రజలు ఓటేయగా.. దాదాపు 43 నెలల తర్వాత అది సాకారమైంది. ఈ నెల23న బ్రెగ్జిట్ బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలుపగా, బుధవారం యూరోపియన్ పార్లమెంట్ కూడా ఆమోదముద్ర వేసింది. ఈయూ నుంచి వైదొలిగినా బ్రిటన్‌లో ఇప్పటికిప్పుడు వచ్చే మార్పులేమీ ఉండవు. ట్రాన్షిషన్ పీరియడ్ కారణంగా ఈ ఏడాది చివరివరకు యథాతథ స్థితి కొనసాగనుంది. అయితే ఈ సమయంలో ఈయూ సంస్థల్లో బ్రిటన్‌కు ప్రాతినిధ్యం, ఓటింగ్ హక్కులు ఉండవు. ఈయూతో వాణిజ్య చర్చలకు సిద్ధమని బ్రిటన్ ఇప్పటికే ప్రకటించగా, ఏయే అంశాలపై సంప్రదింపులు జరుపాలన్నదానిపై ఈయూ సభ్యదేశాలు ఇంకా సమాలోచనలు జరుపుతున్నాయి. అయితే ఈ ఏడాది చివరినాటికి వాణిజ్య ఒప్పందం కుదరకపోతే ఐర్లాండ్ ఉనికికే ప్రమాదం తలెత్తుతుందని ప్రధాని లియో వారద్కర్ హెచ్చరించారు. కాగా, బ్రిటన్‌కు బ్రెగ్జిట్ ముగింపు కాదని, సరికొత్త ఉషోదయానికి ఆరంభం అని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు.


బ్రెగ్జిట్ దిశగా కీలక పరిణామాలు.. 

2016 మే 23: రెఫరెండంలో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా 52 శాతం మంది ఓటు. ప్రధాని పదవికి కామెరాన్ రాజీనామా. 

జూలై 13: ప్రధానిగా థెరెసా మే బాధ్యతలు.

నవంబర్ 25: బ్రెగ్జిట్‌కు 27మంది ఈయూ నేతల ఆమోదం.

జూన్ 27: తన బ్రెగ్జిట్ ప్రణాళికను ఎంపీలు మూడుసార్లు వ్యతిరేకించడంతో ప్రధాని పదవికి థెరెసా మే రాజీనామా.

జూలై 23: ప్రధానిగా బోరిస్ జాన్సన్ బాధ్యతలు.

అక్టోబర్ 3: నూతన బ్రెగ్జిట్ ప్రణాళికను ఈయూకు పంపిన బ్రిటన్.

అక్టోబర్ 17: బ్రెగ్జిట్ ఒప్పందం కుదిరినట్టు ఈయూ, బ్రిటన్ ప్రకటన.

డిసెంబర్ 12: ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం. మళ్లీ ప్రధానిగా బోరిస్ జాన్సన్

2020 జనవరి 23: బ్రెగ్జిట్ బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం.

జనవరి 29: బ్రెగ్జిట్ ఒప్పందానికి ఈయూ పార్లమెంట్ ఆమోదం.  

జనవరి 31: ఈయూ నుంచి బయటికి వచ్చిన బ్రిటన్. 


logo