సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Jul 17, 2020 , 17:16:11

రెండో ప్ర‌పంచ యుద్ధం నాటి బాంబు నిర్వీర్యం

రెండో ప్ర‌పంచ యుద్ధం నాటి బాంబు నిర్వీర్యం

హైద‌రాబాద్ : రెండ‌వ ప్ర‌పంచ‌యుద్ధంలో తీవ్ర‌పేలుడు స్వాభావం ఉన్న 45 కేజీల పేల‌ని బాంబును హాంకాంగ్ పోలీసులు నేడు నిర్వీర్యం చేశారు.కై తక్ ఎమ్‌టిఆర్ స్టేషన్ సమీపంలో నిర్మాణ స్థలంలో బాంబును గురువారం నాడు గుర్తించారు. బాంబు సమీపంలోని నివాసాలు, వ్యాపారాలకు సంబంధించి 2,300 మందికి పైగా ప్రజలను బలవంతంగా తరలించారు. శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయంలో బాంబును సురక్షితంగా నిర్వీర్యం చేయ‌డంతో స్టేషన్‌లో రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.

ఒక‌వేళ బాంబు పేలిన‌ట్లైతే సమీప నివాసాలతో పాటు ఎంటీఆర్ స్టేషన్ కు తీవ్ర నష్టం కలిగేద‌ని సీనియర్ బాంబు నిర్మూలన అధికారి అలిక్ మెక్‌విర్టర్ చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం.. ఒక మీటరు పొడవున్న ఈ బాంబు అమెరికాకు చెందిన రెండవ ప్రపంచ యుద్ధం నాటిద‌న్నారు. సుర‌క్షితంగా బాంబును నిర్వీర్యం చేయ‌క‌పోతే తీవ్ర న‌ష్ట‌మే సంభ‌వించేద‌న్నారు. హాంకాంగ్‌లో ఎక్కువ‌గా నిర్మాణ ప్ర‌దేశాల్లోనే రెండో ప్ర‌పంచ‌యుద్ధం నాటి పేల‌ని బాంబులు ల‌భ్య‌మౌతున్నాయి.

ఫిబ్రవరిలో హ్యాపీ వ్యాలీలోని సిక్కు ఆలయంలోని నిర్మాణ స్థలంలో సైతం యుద్ధకాలం నాటి బాంబు క‌నుగొన‌బ‌డింది. దీన్ని నిర్వీర్యం చేసే క్ర‌మంలో సమీపంలోని హోటల్‌ నుండి  సుమారు 300 మంది ఆరాధకులు, అతిథులను ఖాళీ చేయించారు. ఇక్క‌డ ల‌భించిన బాంబు 454 కిలోల బరువు, 1.3 మీటర్ల పొడవు, 0.4 మీటర్ల వ్యాసం కలిగి ఉంది. మే నెలలో సైతం త్సేంగ్ క్వాన్ ఓ ల్యాండ్‌ఫిల్ వ‌ద్ద‌ 200 కిలోల జపనీస్ కవచం ఉన్న బాంబును క‌నుగొన్నారు. దాన్ని ధ్వంసం చేసే ముందు సైతం పోలీసులు సుమారు 50 మందిని అక్క‌డి నుంచి తరలించారు.


logo